రూ.కోటి ఖర్చుతో 5 ఎకరాల స్థలంలోని పురాతన భవనానికి సరికొత్త రూపు
జనవరిలోనే సీఎం చేతుల మీదుగా నేషనల్ లా యూనివర్శిటీకి శంకుస్థాపన
చంద్రబాబు హయాంలో రోడ్లు భవనాల శాఖలో ‘భవనాలు’ మాయం
సీఎం జగన్ నాయకత్వంలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కిటెక్చర్ బోర్డు’ ఏర్పాటు
అభివృద్ధి ఏదని ప్రశ్నించేవారికి ఈ భవన పున:నిర్మాణం నిలువెత్తు నిదర్శనం
నంద్యాల : అభివృద్ధి లేదని విష ప్రచారం చేసే ప్రతిపక్షాలకి నంద్యాల జిల్లాలో పునరుద్ధరించిన వారసత్వ సబ్ కలెక్టర్ కార్యాలయ భవన పునర్ నిర్మాణం సమాధానమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. 1896లో కట్టిన సబ్ కలెక్టర్ భవనం, ఆ తర్వాత స్వాతంత్ర్యానికి పూర్వం 1915లో బ్రిటీష్ హయాంలో మరమ్మతుల పనులు చేశారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అసాంఘీక కార్యకలాపాలకు , కంపచెట్లకు, కుక్కలు, పందులకు ఆవాసంగా పూర్తిగా కూలిపోయే స్థితికి భవనం చేరిన సంగతి నంద్యాల ప్రజలకు తెలుసన్నారు. ఇన్నేళ్ల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాన్ని పునర్నిర్మాణం చేసిందన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆయన ఈ భవనాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కేవలం రూ.కోటితో 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్ అండ్ బీ శాఖ అద్భుతంగా నిర్మించిందన్నారు. భవనం చుట్టూ 5 ఎకరాల స్థలానికి సంబంధించి ల్యాండ్ స్కేపింగ్ ద్వారా తోటలా మార్చనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.అభివృద్ధి ఏదని అవగాహన లేకుండా ప్రశ్నించేవారికి ఈ భవన నిర్మాణం నిలువెత్తు నిదర్శనమన్నారు. జిల్లా ఏర్పాటైన వెంటనే అనేక ఇబ్బందుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ నేతృత్వంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలన అందించడాన్ని మంత్రి బుగ్గన అభినందించారు. అందులో భాగంగా భవన నిర్మాణాలు చేపట్టి సహకరించిన జిల్లా యంత్రాంగం సహా ఆర్ అండ్ బీ శాఖ కృషిని మెచ్చుకున్నారు.
నాలుగేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు
నాలుగేళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తిచేసిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.రూ.500 కోట్లతో నంద్యాలలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో నంద్యాలను జిల్లాగా చేసి అభివృద్ధికి చిరునామాగా మార్చామన్నారు. నంద్యాల నుంచి కొల్హాపూర్, ఆత్మకూరు మీదుగా హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి, నంద్యాల నుంచి వైఎస్ఆర్ జిల్లాలోని జమ్ములమడుగుకు నేషనల్ హైవే, డోన్ నియోజకవర్గంలో జాతీయ రహదారి వంటి వేలకోట్ల ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టును 1 టీఎంసీ సామర్థ్యం పెంచడమే కాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా 3 టీఎంసీల నీటిని గాజులదిన్నెకు ఈ ప్రభుత్వం కేటాయింపులుచేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కర్నూలు నగరానికి తాగునీటి ఇబ్బంది రాకుండా వన్ టౌన్ లో రూ.130 కోట్లతో మురికి నీటిని శుద్ధి చేసే ఎస్టీపీని ఏర్పాటు చేశామన్నారు. వందలాది కోట్లతో కర్నూలులో రహదారులు నిర్మించామన్నారు. రూ.130 కోట్లతో కర్నూలులోని జగన్నాథ గట్టుపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు త్వరలోనే సీఎం జగన్ భూమిపూజ చేసేందుకు కసరత్తు జరుగుతుందన్నారు.
చంద్రబాబు హయాంలో రోడ్లు భవనాల శాఖలో ‘భవనాలు’ మాయం
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గెస్ట్ హౌస్ లలో వెయిటర్లు ఎందుకని ప్రశ్నించిన విజనరీ ఆయన అంటూ మంత్రి బుగ్గన సెటైర్లు వేశారు. రోడ్లు భవనాల శాఖలో ‘భవనాల’ను చంద్రబాబు సమాధి చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భవననిర్మాణాల విషయంలో ఒకే రకమైన ప్రామాణికతను తీసుకువచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కిటెక్చర్ బోర్డు’ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖలో భవనాలు భాగమని నిరూపిస్తూ నంద్యాల జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ఆ శాఖకు పునర్ వైభవం తీసుకువచ్చామన్నారు. కోటి రూపాయాలతో నిర్మించిన సబ్ కలెక్టర్ కార్యాలయ పనుల్లో కాంట్రాక్టర్ తన బంధువని పనులు అప్పగించి అంచనా పెంచినట్లు ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేయడంపై మంత్రి బుగ్గన ఖండించారు. వాస్తవం అయితే ఏదైనా రాయాలని, అవాస్తవాల ప్రచారం జర్నలిస్టులు, మీడియాకు తగదని ఆయన ఈ సందర్భంగా సూచించారు.