అధినేతకు వినతిపత్రాలు సమర్పిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు
తలసాని కుమారుడు సాయి, మల్లారెడ్డి అల్లుడు మర్రి అసెంబ్లీకి ?
తనతో పాటు కుమారుడికీ టికెట్ అడుగుతున్న మైనంపల్లి
తనకు విరామం ఇచ్చి వారసుడికి చాన్స్ ఇవ్వాలని కోరుతున్న బాజిరెడ్డి
హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా గెలుపు గుర్రాలపై కేసీఆర్ కసరత్తు
త్వరలో జాబితా విడుదలకు సన్నాహాలు…ఆశావహుల్లో ఉత్కంఠ
హైదరాబాద్: ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి
తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌రావు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. వరుసగా మూడోసారి రాష్ట్రంలో
అధికారం చేపట్టే దిశగా వ్యూహరచన చేస్తున్న సీఎం పార్టీ అభ్యర్థుల ఎంపికలో
ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కువ సాగదీయకుండా వీలైనంత త్వరగా అభ్యర్థుల
జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి తమ
వారసులకు అవకాశం ఇవ్వాలంటూ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పార్టీ సిట్టింగ్
ఎమ్మెల్యేల్లో కొందరు అధినేతకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. అవకాశం చిక్కితే
తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల ద్వారా అరంగేట్రం చేయాలని
సుమారు 30 మంది నేతల వారసులు ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యేల
వినతులను పరిశీలిస్తున్న కేసీఆర్..కొందరి వినతిని పరిగణనలోకి తీసుకోవడంపై
తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ
గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో
ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
లోక్‌సభకు తలసాని : అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరో మూడు నెలల్లోనే లోక్‌సభ
ఎన్నికలు తెరమీదకు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు అనుసరించే
వ్యూహం ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కొంత మేర ప్రభావం చూపే అవకాశం
కన్పిస్తోంది. కొందరు వారసులకు అసెంబ్లీ టికెట్లు దక్కే సూచనలు
కనిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
కుమారుడు సాయికిరణ్ సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గట్టి
పోటీనిచ్చేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను లోక్‌సభ అభ్యరి్థగా పంపే
యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఆయన స్థానంలో సాయికిరణ్ సనత్‌నగర్
అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగే అవకాశముంది. ఇదే తరహాలో గతంలో
మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన మంత్రి మల్లారెడ్డిని మరోమారు లోక్‌సభకు పోటీ
చేయించాలని సీఎం భావిస్తున్నారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన ఆయన
అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మేడ్చల్ సీటు కేటాయిస్తారని పార్టీ వర్గాలు
చెబుతున్నాయి.
జోరుగా పర్యటనలు : పలువురు ఎమ్మెల్యేల కుమారులు, ఇతర కుటుంబసభ్యులు ఇప్పటికే
క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ వేర్వేరు పదవుల్లో కొనసాగుతున్నారు. ఆర్మూర్,
నిర్మల్, పటాన్చెరు, తాండూరు, నిజామాబాద్ అర్బన్, చేవెళ్ల, షాద్‌నగర్
ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు నియోజకవర్గ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నారు.
అవకాశం చిక్కితే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి
చూపుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి
హన్మంతరావు కుమారుడు రోహిత్ రావు మెదక్ టికెట్‌ను ఆశిస్తూ నియోజకవర్గంలో
విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోహిత్‌కు కూడా టికెట్ ఇబ్వాలని మైనంపల్లి
కోరుతున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు,
మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) కుమారుడు కార్తీక్‌రెడ్డి, హైదరాబాద్
జిల్లా పరిధిలో ముఠా గోపాల్ (ముషీరాబాద్) కుమారుడు ముఠా జయసింహ కూడా
అసెంబ్లీపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే
జోగు రామన్న కుమారుడు జోగు ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్‌గా
కొనసాగుతున్నారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోణప్ప సోదరుడు కోనేరు క్రిష్ణ
ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. వీరితో పాటు
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కుమారుడు వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే
నడింపెల్లి దివాకర్‌రావు కుమారుడు విజిత్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా
నాయక్ భర్త శ్యాం నాయక్ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారులు
రామకృష్ణ, రాఘవేంద్ర, భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి తెల్లం వెంకట్రావు
సోదరి తెల్లం సీతమ్మ (జెడ్పీటీసీ) కూడా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ
అవకాశం కోసం చూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల ఎమ్మెల్యే
విద్యాసాగర్‌రావు.. కుమారుడు డాక్టర్ సంజయ్‌కు టికెట్ ఇవ్వాల్సిందిగా
కోరుతున్నారు. మంథనిలో పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు భార్య పుట్ట
శైలజ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్స్వాడ) కుమారుడు
భాస్కర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ (నిజామాబాద్ రూరల్)
కుమారుడు జగన్మోహన్ (దర్పల్లి జెడ్పీటీసీ), హనుమంతు షిండే (జుక్కల్)
కుమారుడు హరీష్ కుమార్ షిండే, గంప గోవర్దన్ (కామారెడ్డి) కుమారుడు శశాంక్
టికెట్ ఆశిస్తున్న వారసుల జాబితాలో ఉన్నారు. తనకు విశ్రాంతి ఇచ్చి కుమారుడికి
టికెట్ ఇవ్వాలని బాజిరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్
జిల్లాలో గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి) సతీమణి గండ్ర జ్యోతి (జిల్లా
పరిషత్ చైర్పర్సన్), డీఎస్ రెడ్యా నాయక్ (డోర్నకల్) కుమారుడు డీఎస్
రవిచంద్ర, కుమార్తె కవిత మాలోత్ (మహబూబాబాద్ ఎంపీ) ఎమ్మెల్యే టికెట్
ఆశిస్తున్నారు.