సచివాలయ వ్యవస్థ ప్రధాన ధ్యేయమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 32 వ డివిజన్ 229 వ వార్డు సచివాలయ
పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్
ఇంఛార్జి గుండె సుందర్ పాల్, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదినారాయణ
వీధి, గన్నాబత్తుల బాబూరావు వీధి, బసవతారకనగర్ రోడ్డు, డొంక రోడ్డులలో
విస్తృతంగా పర్యటించి 286 ఇళ్లను సందర్శించారు. గతంలో పాలన అంతా ఒకేచోట
కేంద్రీకృతమై ఉండేదని.. కానీ పాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన సచివాలయాల
ద్వారా సేవలన్నీ ప్రజల గుమ్మం వద్దకే వస్తున్నాయని మల్లాది విష్ణు
పేర్కొన్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, 2వేల జనాభాకు సచివాలయం
ఏర్పాటుతో పాలన మరింత సుగుమం అయిందని తెలిపారు. ఏ సంక్షేమ పథకమైనా, సమస్య
ఎటువంటిదైనా వాలంటీర్లను అడిగితే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఈ
మూడున్నరేళ్లలో ప్రజలలో బలంగా ఏర్పడిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సీఎం
జగన్ ప్రభుత్వం అందిస్తోన్న విప్లవాత్మకమైన సేవలను దేశం మొత్తం
అభినందిస్తోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.వాలంటీర్ల వ్యవస్థపై పచ్చ మీడియావి విషపు రాతలు
సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందుతున్న సేవలపై ప్రజలందరూ హర్షం వ్యక్తం
చేస్తుంటే.. తెలుగుదేశం, పచ్చ మీడియాకు ఎందుకంత ఏడుపు అని మల్లాది విష్ణు
ప్రశ్నించారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదని.. నిస్వార్థ సేవకులని పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ అనతికాలంలోనే
దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వ్యవస్థను
ప్రశంసించారని గుర్తుచేశారు. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్లో ఒక పాఠ్యాంశంగా ఈ
వ్యవస్థను చేర్చారని తెలియజేశారు. కోవిద్ సమయంలో బయటకు రావాలంటేనే బయపడుతున్న
సమయంలో.. ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు సేవలందించారని మల్లాది విష్ణు
పేర్కొన్నారు. కరోనా టెస్టులు పెంచడం, వ్యాక్సినేషన్, డోర్ టూ డోర్ ఫీవర్
సర్వే, సత్వర చికిత్సకు చర్యలతో మన రాష్ట్రంలో మరణాల సంఖ్యను తగ్గించడంలో
వాలంటీర్లు పాత్ర అమోఘమన్నారు. అటువంటి వ్యవస్థపై పచ్చ మీడియా విషపు రాతలు
రాస్తూ.. వారి సేవలను కించపరుస్తోందని మండిపడ్డారు. 2019 తర్వాత జరిగిన
పంచాయతీ, పరిషత్, పురపాలక ఎన్నికలలో ఎక్కడా వాలంటీర్ల జోక్యం లేదని.. కానీ
పచ్చ మీడియా లేనిపోని నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు.