చాలాకాలంగా బకాయిపడ్డ ఉద్యోగుల వేతనాలు, భారీగా పెరిగిన అప్పులు తీర్చేందుకు
వేరే మార్గం లేక వాషింగ్టన్ లోని పాకిస్తాన్ ఆస్తులను అమ్మకానికి పెట్టిన
విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలోని అమ్మకానికి పెట్టిన ఎంబసీ 7.1 మిలియన్
డాలర్లకు అమ్ముకుంది. వాషింగ్టన్‌లోని పాకిస్తాన్ చారిత్రాత్మక భవనమైన ఎంబసీ
2003 నుంచి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న కారణంగా 2018లో దౌత్య హోదాను కూడా
కోల్పోయిన ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌కు చెందిన ఓ రియాల్టీ సంస్థతో
సహా పలు సంస్థలు పోటీపడగా చివరకు పాకిస్తాన్ కు చెందిన వ్యాపారవేత్త హఫీజ్
ఖాన్ దీన్ని 7.1 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు.
పాకిస్థాన్‌కు వాషింగ్టన్లో రెండు చోట్ల ఎంబసీ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్
స్ట్రీట్‌లో ఉన్న ఈ భవనాన్ని1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో
కార్యకలాపాలు సాగాయి. క్రమేపీ అందులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఈ భవనాన్ని దుర్భర స్థితిలో ఉన్న ఆస్తుల లెక్కలో
చేర్చడంతో దీని అంచనా విలువపై టాక్స్ కూడా భారీగా పెరిగింది. శిథిలావస్థకు
చేరుకున్న ఈ భవనాన్ని కొనుగోలు చేసేందుకు గతేడాది బిడ్ లను ఆహ్వానించింది
పాకిస్తాన్ ప్రభుత్వం. తర్వాత భవనం తరగతిని మార్చిన పాకిస్తాన్ అధికారిక
వర్గం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఒకపుడు
క్లాస్ -2 హోదాలో ఉన్న ఈ భవనం తర్వాత క్లాస్-3 కి ఇప్పుడు క్లాస్-4 స్థాయికి
పడిపోయింది.