* పాలిటెక్నిక్ విద్యార్ధుల ఉపాధి అవకాశాలపై ప్రత్యేక పునశ్చరణ *
* రాష్ట్ర స్ధాయిలో ప్రిన్సిపల్స్, ప్లేస్ మెంట్ అధికారుల భాగస్వామ్యం *
విజయవాడ : పరిశ్రమ, సాంకేతిక విద్యా సంస్ధల మధ్య అంతరాన్ని తగ్గించడానికి
వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు
చదలవాడ నాగ రాణి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలతో పరిశ్రమ సహకారాన్ని
బలోపేతం చేసే క్రమంలో అనుసరించవలసిన వ్యూహంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాల
ప్రిన్సిపాల్స్ కు నాగార్జునా విశ్వవిద్యాలయం వేదికగా సోమవారం ప్రత్యేక
పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసందర్భగా నాగరాణి మాట్లాడుతూ చివరి
సంవత్సరం చదువుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు గుణాత్మక పారిశ్రామిక
శిక్షణను అందించటంతో పాటు , క్యాంపస్ ప్లేస్మెంట్లను ఆకర్షించటమే ద్యేయంగా ఈ
కార్యక్రమానికి రూపకల్పన చేసామన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా
విధ్యార్ధులను తీర్చిదిద్ది, వారికి ఉపాధి అవకాశాలను చూపుతామన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జిఎం ఎన్.భాను మాట్లాడుతూ పారిశ్రామిక శిక్షణ,
పరిశ్రమ అనుసంధానానికి తమ వంతు మద్దతును అందిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ లో
ఇప్పటి వరకు 4417 మంది విద్యార్థులు శిక్షణ పొందారన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎఫ్ట్రానిక్స్ సిఇఓ రామకృష్ణ పారిశ్రామిక శిక్షణ
యొక్క ఆవశ్యకతను వివరిస్తూ దేశాభివృద్ది పారిశ్రామిక రంగం పురోగతిపై అధార పడి
ఉందన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి అభ్యాసం,
మెరుగైన సాంకేతికత అవసరమన్నారు. నిరంతర నవీకరణ, అభివృద్ధిపైనే సంస్ధల మనుగడ
అధారపడి ఉంటుందని మానవవనరుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనదని వివరించారు. నాణ్యత,
ఏకరూపత కోసం నూతనంగా రూపొందించిన పారిశ్రామిక శిక్షణ మార్గదర్శకాలు, విధి
విధానాల పత్రాన్ని ఈ సందర్భంగా సంచాలకురాలు నాగరాణి విడుదల చేసారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రేరణ కోసం రూపొందించిన లేఖలు కూడా కళాశాలల
ప్రిన్సిపాల్స్ కు పంపిణీ చేసారు. కార్యక్రమంలో ప్రకాష్ స్పెక్ట్రో కాస్ట్
ఎండి పార్థసారధి, సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు వి పద్మారావు,
ప్రాంతీయ సంయిక్త సంచాలకులు జెఎస్ఎన్ మూర్తి, ఎ నిర్మల్ కుమార్, ఉప సంచాలకులు
రామకృష్ణ , ఎస్బిటిఇటి కార్యదర్శి కె విజయ భాస్కర్, సంయిక్త కార్యదర్శి కె
నారాయణరావుతో పాటు డిటిఇ, ఎస్బిటిఇటి అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల ప్రిన్సిపాల్స్,
ట్రైనింగ్, ప్లేస్మెంట్ అధికారులు ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.