టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన
పంచమితీర్థం కార్యక్రమం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా
నిర్వహించామని టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి చెప్పారు. సోమవారం
పంచమితీర్థం కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబరు 20వ
తేదీ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
సోమవారం పంచమితీర్థం కార్యక్రమంలో లక్ష మందికి పైగా భక్తులు హాజరై పుణ్య
స్నానాలు చేశారన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతి చుట్టు
పక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివారం రాత్రికే
తిరుచానూరు చేరుకున్నారని ఛైర్మన్ తెలిపారు. కరోనా కారణంగా రెండేళ్ళ తరువాత
పంచమితీర్థం పుష్కరిణిలో చేస్తున్నందువల్ల పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని
టీటీడీ యాజమాన్యం ముందుగానే అంచనా వేసిందన్నారు. ఇందులో భాగంగానే మూడు
తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి అందులో భక్తులు సేద తీరడంతో పాటు వారికి
ఆదివారం రాత్రి నుంచే అన్నప్రసాదాలు, కాఫీ, టీ, పాలు, తాగునీరు అందించామని ఆయన
వివరించారు. వీటితోపాటు షెడ్లల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు
తెలిపారు. షెడ్ల నుంచే నేరుగా భక్తులు పుష్కరిణికి చేరుకునేలా ప్రత్యేకంగా
క్యూలైన్లు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని పటిష్టమైన
భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పవిత్రమైన కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి
చేసిన టీటీడీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. శ్రీ పద్మావతి
అమ్మవారు ప్రతి ఒక్కరికీ సకల శుభాలు అందించాలని సుబ్బారెడ్డి కోరుకున్నారు.