అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే
కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని
షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం4
రాకెట్.. దీనిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మూడు దశలను పూర్తి
చేసుకున్న చంద్రయాన్-3 జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ల్యాండర్,
రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌ను మోసుకుని ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్
నింగిలోకి ఎగిరింది. సకాలంలో పేలోడ్‌ను మండించి తొలి రెండు దశలను విజయవంతంగా
పూర్తి చేసుకుంది. చంద్రుడి దిశగా వెళ్లేందుకు 02.42PM సమయంలో మూడో దశ
పేలోడ్‌ను మండించింది. ఈ మూడు దశలు నిర్ణీత ప్రణాళిక ప్రకారమే సజావుగా
జరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. స్పేస్‌క్రాఫ్ట్‌ను అవసరమైన ఎత్తుకు
చేర్చేందుకు ఈ దశలను పూర్తిచేసుకొంది. 02.54 సమయంలో మూడో దశ ముగియడంతో
జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
ప్రకటించారు. దీని గమనం సజావుగా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రయాన్-3 విజయవంతంగా కక్ష్యలో చేరడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు
చేసుకున్నారు. దీనిపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ స్పందిస్తూ ఇది చరిత్రాత్మక
రోజు అని అభివర్ణించారు. ఈ ప్రయోగం అనంతరం కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో
కలిసి సోమ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే
ఆగస్టు 23 సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అవకాశముందని
తెలిపారు.
ప్రయోగం సాగుతుందిలా : ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన
చంద్రయాన్-3.. 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా
కక్ష్యను పెంచుతారు. తర్వాత చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్ఫర్
ట్రాజెక్టరీలోకి చంద్రయాన్-3ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ
క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ (ఎల్వోఐ)
ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజిన్‌ను మండించి చంద్రయాన్-3
వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి
ఒడిసిపడుతుంది. అప్పటినుంచి అది చందమామ కక్ష్యలో తిరుగుతుంది. అంతిమంగా
చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి దీన్ని
ప్రవేశపెడతారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి.. ల్యాండర్,
రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో
జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని
క్రమంగా తగ్గించుకుంటుంది. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో
సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుందని ఇస్రో వెల్లడించింది.