74 మంది విద్యార్దులకు ఉద్యోగ అవకాశం : నాగరాణి
రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ విద్యార్దుల కోసం నిర్వహించిన జాబ్ మేళాలో 74 మంది విద్యార్దులు ఉద్యోగాలు పొందారని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ లో 2022, 2023 ఉత్తీర్ణుల కోసం జాబ్ మేళాను నిర్వహించామన్నారు. విజయవంతమైన జాబ్ మేళాతో 74 మంది విద్యార్థులు సుజ్లాన్ గ్లోబల్ లో అవకాశాలు పొందగలిగారన్నారు. ఎలక్ట్రికల్ నుండి 28, మెకానికల్ ఇంజనీరింగ్ నుండి 46 మంది డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ స్థానాలకు సంవత్సరానికి 2 లక్షల జీతంతో ఎంపికయ్యారని నాగరాణి వివరించారు. ఎంపికైన అభ్యర్థులు ఎనిమిది రాష్ట్రాల్లో పాన్ ఇండియా స్ధాయిలో ఆపరేషనల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ లో పని చేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతిక విద్యా శాఖ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే కాకుండా డిప్లొమా గ్రాడ్యుయేట్ చేసిన వారి కోసం కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లను నిర్వహించడానికి విభిన్న కంపెనీలతో అనుసంధానం చేసుకుటుందని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను సృష్టించే వాతావరణాన్ని పెంపొందించి, పరిశ్రమలతో చురుగ్గా అనుసంధానం అయ్యేందుకు కట్టుబడి ఉన్నామని చదలవాడ నాగరాణి తెలిపారు.