రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు
చీపురుపల్లి పాలిటెక్నిక్ కళాశాల కొత్త భవనం ప్రారంభం
రెండు కొత్త కోర్సులు, అదనపు వసతులు
చీపురుపల్లి : విద్యార్థులు బాగా చదువుకొని రాష్ట్రానికి, తల్లితండ్రులకు గొప్ప పేరు తేవాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కేజీ నుంచి పీజీ వరకు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రభుత్వం రాష్ట్రంలో అత్యున్నత విద్యను అందిస్తోందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సుమారు రూ.8 కోట్లతో నిర్మించిన చీపురుపల్లి జి.బి.ఆర్. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స మాట్లాడుతూ, విద్యార్థులు విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలోనే జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. అభివృద్ధి చెందాలనే తపన ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు . విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం కళాశాలలో మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు మాత్రమే ఉన్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్, సివిల్ కోర్సులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే, కళాశాలను అదనపు ఫ్యాకల్టీ, ఆఫీస్ స్టాఫ్, హాస్టల్ మంజూరు చేస్తామని, క్యాంపస్ రిక్రూట్మెంట్ సౌకర్యాన్ని పెంచుతామని చెప్పారు. ఇకనుంచి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి కళాశాలకు వచ్చి విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటానని అన్నారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, కళాశాల చరిత్ర, అభివృద్ధి చెందిన విధానాన్ని వివరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ కృషితో ఈ కళాశాల ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. తన ఎంపి నిధులు రూ.10 లక్షలతో కళాశాల ప్రాంగణంలో అథ్లెటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ, సాంకేతిక నిపుణులకు అపార ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. ఐటీఐ, పాలిటెక్నిక్ చదివినవారికి ఎంతో డిమాండ్ ఉందని అన్నారు. కోర్సు పూర్తి అయిన వెంటనే, క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఉద్యోగంలో చేరిపోవాలని, ఆ తరువాత మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, ఎంపిపి ప్రతినిధి ఇప్పిలి అనంత్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్.విజయలక్ష్మి, పలువురు విద్యార్థులు మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, ఆర్జేడీ. సత్యనారాయణ మూర్తి, ఆర్డీవో బి. శాంతి, ఎంపిపి. ఐ.వెంకట నరసమ్మ, జెడ్పీటీసీ వి.శిరీష, తాసిల్దర్ ఎన్.ప్రసాదరావు, ఎంపీడీఓ డి.శ్వేత, ఇతర అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.