బైజూస్ కంపెనీకి ప్రభుత్వ నిధులంటూ నిందలు..
టీడీపీ వ్యాఖ్యలను ఖండించిన విద్యాశాఖ
ఏపీ విద్యారంగంలో డిజిటల్ విప్లవాన్ని ఆపేందుకు టీడీపీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబ్ ల కొనుగోలులో రూ.221 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. టెండరింగ్ పద్ధతిలో ఏపీ ప్రభుత్వం 5.19 లక్షల ట్యాబ్‌ల కొనుగోలు లో రూ.187 కోట్లు ఆదా చేసినప్పటికీ.. ప్రశంసించాల్సింది పోయి అసత్య ప్రచారం చేస్తోంది.
డిసెంబర్ 21 వ తేదీన బాపట్ల జిల్లా యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.32 వేల విలువైన ప్రీ అప్ లోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.1466 కోట్లు కాగా, టెండరింగ్ పద్ధతి ద్వారా రూ.187 కోట్లను ఆదా చేసింది.
ఈ విషయంపై టీడీపీ నేత పట్టాభిరామ్ విద్యాశాఖ ప్రతిష్ట దిగజార్చేలా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. పేద విద్యార్థులకు డిజిటల్ చదువులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు తూట్లు పొడిచేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టాభి తప్పుడు ఆరోపణలు చేయ్యడాన్ని విద్యాశాఖ ఖండించింది. ట్యాబ్ ధర అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో రూ.14,500 ఉండగా.. టెండర్ ప్రక్రియ ద్వారా ఒక్కో ట్యాబ్ కు ₹12,843 ధరకే కొనుగోలు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ధర కంటే ఇది ₹3,603 (22%) తక్కువ. ట్యాబ్‌తో పాటు, ఫ్లిప్ కవర్, 64 జీబీ మెమరీ కార్డ్, ఓటీజీ కేబుల్ మూడేళ్ల వారంటీ కార్డ్‌తో సహా అనేక అదనపు వస్తువులను కూడా విద్యార్థులకు అందించినట్లు విద్యా శాఖ తెలిపింది. ట్యాబ్ మొత్తం ధర, అంటే ₹12,843కు పైన పేర్కొన్న అన్ని వస్తువులతో ఈ ధరను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, మండల ప్రధాన కార్యాలయం వరకు రవాణా ఖర్చు కూడా ఈ ధరలోనే కలిపి ఉంటుందని తెలిపింది. ట్యాబ్ ల కొనుగోలు కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు పాల్గొన్నాయని, టెండర్ అవార్డులో ఎటువంటి పక్షపాతం లేదని విద్యాశాఖ తెలియజేసింది.