విజయవాడ : రాష్ట్రంలో విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది,
వారికి ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
అహర్నిశలూ శ్రమిస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గురువారం పలు
అంశాలు వెల్లడించారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని అందుకు
విదేశాల్లో చదువులకూ అండగా నిలుస్తామని సీఎం జగన్ విద్యార్థులకు భరోసా
కల్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచీ ఒక సత్య నాదెళ్ల
తయారవ్వారని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని విజయ సాయిరెడ్డి అన్నారు.
ఆత్రేయపురం-పూతరేకులకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
ఆంధ్రప్రదేశ్ లోని ఆత్రేయపురం – పూతరేకులు దేశవ్యాప్తంగా అలాగే
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణను చూసి సంతోషంగా ఉందని విజయసాయిరెడ్డి
అన్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా పూర్తి సహజ సిద్ధమైన
పదార్థాలతో తయారు చేసే ఈ పూతరేకులు అన్ని వయసుల వారికి ఇష్టమైనదిగా మారిందని
ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ స్వీట్ ని ఒకసారి రుచి చూడాలని, వారు ఆ రుచిని
ఎప్పటికీ మరచిపోరని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానని అన్నారు.
కూరగాయలు ధరలు నియంత్రించాలి
దేశంలోని పలు ప్రాంతాల్లో టమోటాలు, ఇతర కూరగాయల ధరలు ఒక్కసారిగా భారీగా
పెరిగాయని, పలు చోట్ల టమాట కిలో రూ.100కు పైగా విక్రయిస్తున్నారని
విజయసాయిరెడ్డి తెలిపారు. కూరగాయల ఉత్పత్తి చేసే సమయం నుంచి సరఫరా చేసేవరకు
మధ్య గల సమయంలో కూరగాయల నిల్వ, ప్రాసెసింగ్ తదితర నిర్వహణ అంశాలపై కేంద్ర
ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా చేస్తేనే ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలను అరికట్టవచ్చని అన్నారు. అలాగే
డిమాండ్‌కు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శీతల గిడ్డంగులను ఏర్పాటు
చేయాలని అన్నారు. కూరగాయల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని ఆయన కోరారు.