పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో ఉపాధ్యాయుల ఆందోళన
అమరావతి : ‘ఫార్మెటివ్-1 పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారో లేదో
ఆన్లైన్లోనే తనిఖీ చేస్తాను.. విద్యార్థులు ఆంగ్లంలోనే పరీక్షలు రాయాలి’
అంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చిన ఆదేశాలు
ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా
మంగళవారం ఫార్మెటివ్-1 పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి విద్యార్థుల
సన్నద్ధత, వర్క్‌బుక్‌లను మంగళవారం ఆన్లైన్లో తనిఖీ చేస్తానని ప్రవీణ్
ప్రకాష్ సామాజిక మాధ్యమాల ద్వారా ఆదేశాలిచ్చారు. కంప్యూటర్ ర్యాండమ్ చెక్
ద్వారా ఏదో ఒక పాఠశాలను ఎంపిక చేసి వీడియోకాల్ చేసి పరీక్షిస్తానని చెప్పారు.
ఈ మేరకు ప్రధానోపాధ్యాయులందరూ ఫోన్లను అందుబాటులోకి ఉంచుకోవాలని
ఆదేశాలిచ్చారు. ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో ఉండగా ప్రవీణ్ ప్రకాష్
వాట్సప్ వీడియో కాల్లో తనిఖీలంటూ హడావుడి చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు
వ్యతిరేకిస్తున్నాయి.ఆయన తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని, ఏ
లోపం గుర్తించినా టీచర్లపైనే చర్యలు తీసుకుంటున్నారని సంఘాల నేతలు
చెబుతున్నారు.