విజయవాడ: విధ్యార్ధులకు అన్ని విధాల సహాయకారిగా ఉండేలా సాంకేతిక విద్యాశాఖ
నూతన వెబ్ సైట్ ను రూపకల్పన చేసామని ఆ శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
స్క్రీన్ రీడర్లను ఉపయోగించడం ద్వారా దృష్టిలోపం ఉన్న వ్యక్తులు సైతం
చదవగలిగేలా ఈ నూతన వెబ్ సైట్ కంటెంట్‌ను అందిస్తుందన్నారు. సాంకేతిక విద్యాశాఖ
నూతనంగా రూపొందించిన స్నేహపూర్వక వెబ్ సైట్ ను సోమవారం మంగళగిరి కమీషనరేట్ లో
కమీషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ నూతన వెబ్ సైట్ ద్వారా
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల గురించిన మొత్తం సమాచారాన్ని
సందర్శకులు, విద్యార్థులు యాక్సెస్ చేయగలుగుతారన్నారు. ఫీడ్‌బ్యాక్ వ్యవస్ధను
సైతం ఈ వెబ్ సైట్ కలిగి ఉందని, సాధారణ పౌరుల మొదలు, విద్యార్థులు, సందర్శకులు
వారి ఆలోచనలు, సూచనలు, ఫిర్యాదులు మొదలైనవాటిని ఇక్కడ నేరుగా
పొందుపరచగలుగుతారన్నారు. వీటిని రానున్న కాలంలో వెబ్సైట్ అప్‌గ్రేడేషన్‌కు
విలువైన ఇన్‌పుట్‌లుగా తీసుకుంటామన్నారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్
ఎడ్యుకేషన్, పాలిసెట్ , ఇంజనీరింగ్ అడ్మిషన్లు, విద్యార్థుల బదిలీలు వంటి
ఉపయోగకరమైన వెబ్సైట్ లింక్‌లు కూడా దీనిలో అందుబాటులో ఉంటాయన్నారు.
కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, ఉప
సంచాలకులు డాక్టర్ ఎంఎ రామకృష్ణ, డాక్టర్ బి.కళ్యాణ్, రాష్ట్ర సాంకేతిక
విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి కెవి రమణబాబు, సంయిక్త కార్యదర్శులు జానకి
రామయ్య, సత్యనారాయణ, ఐటి సమన్వయకర్త డాక్టర్ కె రత్నబాబు తదితరులు
పాల్గొన్నారు.