వారికి ఉన్నత భవిష్యత్ అందించేందుకే ట్యాబ్‌ల పంపిణీ
ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి : తల్లిదండ్రులు, విద్యార్ధులకు మంత్రి బొత్స సూచన
తొలివిడత నాడు – నేడు స్కూళ్లలో వాచ్మెన్ల నియామకం
6వ తరగతిలో ఇంటర్ యాక్టివ్ ప్యానళ్ల ద్వారా విద్యాబోధన
తల్లిదండ్రుల సూచనల మేరకు భోజనం మెనూలో మార్పులు/విద్య కోసమే ట్యాబ్‌లు వినియోగించాలి
విజయనగరం : రాష్ట్రంలో తొలివిడత నాడు – నేడు స్కూళ్లలో త్వరలో వాచ్మెన్లను నియమించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆయా పాఠశాలల్లో నాడు – నేడు కింద విలువైన పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీనితోపాటు ఇంటరాక్టివ్ విద్యాబోధనలో భాగంగా టివిలు కూడా ఏర్పాటు చేస్తున్నందున ఆయా పరికరాల భద్రతకోసం వాచ్మెన్లు నియమించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. వాచ్మెన్ల నియామాకానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఇప్పటికే అంగీకరించారని చెప్పారు. ఆయా స్కూళ్లలో పనిచేస్తున్న ఆయాల భర్తలకే వాచ్మెన్లుగా అవకాశం కల్పిస్తామని, ఆయాలు లేని పక్షంలో మాజీ సైనికులకు అవకాశం కల్పిస్తామన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం మెనూపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పలువురు విద్యార్ధులు, తల్లిదండ్రులు గురువారం మెనూలో అందిస్తున్న సాంబారు సరిగా వండటం లేదని, అందువల్ల పిల్లలు భోజనం చేయలేకపోతున్నట్టు తల్లిదండ్రులు మంత్రికి వివరించారు. దీంతో గురువారం మెనూ మార్చే విషయం పరిశీలిస్తామన్నారు. మన విద్యార్ధులు ప్రపంచస్థాయిలో పోటీకి నిలబడేలా వారిని రూపొందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వారికి మంచి భవిష్యత్ అందించేందుకు తపన పడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దీనిలో భాగంగానే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. కేవలం మన రాష్ట్రంతోపాటు దేశంలో ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహాలో విద్యార్ధులకు ట్యాబ్‌లు అందించారని చెప్పారు. రాష్ట్రంలో రూ.600 కోట్లతో 4.80 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్ధులకు అందిస్తున్న ట్యాబ్‌లో 8,9 తరగతుల సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలు ఆంగ్లంలో, తెలుగులో కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్నెట్ లేనప్పటికీ ఆఫ్‌లైన్‌లో ట్యాబ్‌ను విద్యార్ధులు సులువుగా వినియోగించేందుకు వీలుగా రూపొందించామన్నారు. విద్యార్ధులకు అందజేసిన ట్యాబ్‌లను ఇతర అవసరాలకు వినియోగించకుండా చూసేందుకు తగిన మార్పులు చేశామన్నారు. విద్యార్ధులు ఇంటి వద్ద ఎంత సమయం ట్యాబ్ వినియోగించిందీ, ఏయే పాఠ్యాంశాలు చదువుతున్నారో తెలుసుకొనేందుకు వీలుగా ట్యాబ్‌లో ఏర్పాట్లు చేశామన్నారు. ట్యాబ్‌లు ఏమైనా మరమ్మత్తులకు గురైతే మూడేళ్ల వరకు వాటిని మరమ్మత్తులు చేసి వాటిని వినియోగించేలా చేసే బాధ్యత ప్రభుత్వమే వహిస్తుందని మంత్రి తెలిపారు.
నెలాఖరులోగా ట్యాబ్‌లు అందించాలి : డిఇఓకు మంత్రి ఆదేశాలు
జిల్లాలో మంజూరైన ట్యాబ్‌లను ఈ నెలఖారులోగా 8వ తరగతి విద్యార్ధులకు అందజేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఆయా ట్యాబ్‌లలో కంటెంట్ లోడ్ చేసి విద్యార్ధులకు అందించాలన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని డి.ఇ.ఓ.కు మంత్రి ఆదేశించారు. నాడు – నేడు తొలివిడత పూర్తయిన పాఠశాలల్లో 6వ తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 1.50 లక్షల తరగతి గదుల్లో ఈ ప్యానల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
భూహక్కు పత్రాల పంపిణీ ప్రారంభించిన మంత్రి బొత్స
విజయనగరం డివిజనులో వై.ఎస్.ఆర్.జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమంలో భాగంగా సమగ్ర భూసర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. బొండపల్లి మండలం చామల వలస గ్రామానికి చెందిన 19 మందికి భూహక్కు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా భూమిపై హక్కులను కల్పించే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించడానికి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. జిల్లాలో ఫించను భరోసా కింద కొత్తగా 9వేల మందికి ఫించను మంజూరు చేశామన్నారు. వచ్చే జనవరి నుంచి కొత్తగా మంజూరైన వారికి ఫించను మొత్తాలు అందిస్తామన్నారు. వచ్చే జనవరి నుంచి నెలవారి ఫించను మొత్తంగా రూ.2750 అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎం.ఎల్.సి. పెన్మత్స సురేష్‌బాబు, ఆర్.డి.ఓ. ఎం.వి.సూర్యకళ, డి.ఇ.ఓ. లింగేశ్వర రెడ్డి, సమగ్రశిక్ష పి.ఓ. స్వామినాయుడు, బొండపల్లి ఎంపిపి చల్లా చంద్రం నాయుడు, జెడ్పీటీసీ సూర్యప్రకాశరావు, ఏఎంసి చైర్మన్ ముత్యాల నాయుడు, ఎంపిడిఓ వేదవతి, తహశీల్దార్ శ్రీనివాస మిత్రా తదితరులు పాల్గొన్నారు.
కామన్వెల్త్ స్వర్ణపతక విజేత అనిల్‌కు సత్కారం
బొండపల్లి మండలం చామలవలస గ్రామానికి చెందిన పవర్ లిఫ్టర్ బోదంకి అనిల్ కుమార్ ఇటీవల న్యూజిలాండ్ లో ముగిసిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు స్వర్ణాలు గెలుచుకున్న సందర్భంగా మంత్రి ఆ క్రీడాకారుడిని శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యార్ధులంతా అనిల్‌ను స్ఫూర్తిగా తీసుకొని తమకు ఆసక్తి వున్న రంగాల్లో రాణించాలని సూచించారు. అనిల్ రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలో రాణించేందుకు మరిన్ని వసతులను కల్పించే విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు.