పాఠశాల దశలోనే నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వం దృష్టి
టోఫెల్ ప్రైమరీ, జూనియర్ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ
12న జగనన్న విద్యాకానుక, 28 నుంచి అమ్మ ఒడి కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ
వెలగపూడి సచివాలయం : విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాష్ట్ర
ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తూ
‘టోఫెల్’ పరీక్షలకు సిద్ధం చేయనుంది. ఈమేరకు పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో
ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి మండలానికి రెండు జూనియర్
కళాశాలలను నెలకొల్పనుంది. ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసమే కాగా మరొకటి
కో–ఎడ్యుకేషన్ విధానంలో ఏర్పాటు కానుంది. ఈనెల 12న జగనన్న విద్యాకానుక
(జేవీకే)తోపాటు 28వతేదీ నుంచి వారం రోజుల పాటు ‘అమ్మఒడి’ కార్యక్రమాల ద్వారా
చదువుల ఆవశ్యకతను చాటి చెప్పాలని నిర్ణయించింది. పాఠశాలల్లో అమలయ్యే
కార్యకలాపాల సమగ్ర పర్యవేక్షణకు ప్రతి రెవెన్యూ డివిజనల్లో ఒక డిప్యూటీ
ఎడ్యుకేషనల్ అధికారిని నియమించనుంది. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్
అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆ
వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన
విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాల’ పేరుతో జూన్ 15న నియోజకవర్గ స్థాయిలో, 17న
జిల్లా, 20న రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.
3 కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 పోస్టులు : వచ్చే ఏడాది మరో మూడు కొత్త
మెడికల్ కాలేజీలు (పులివెందుల, పాడేరు, ఆదోని) ప్రారంభానికి సిద్ధంగా
ఉన్నాయి. ఒక్కో కాలేజీకి 706 పోస్టుల చొప్పున 2,118 పోస్టుల మంజూరుకు
కేబినెట్ ఆమోదించింది. రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల
వైద్య కళాశాలల్లో ఈ ఏడాదే తరగతులు ప్రారంభమవుతున్నాయి. 6 నుంచి 9 నెలల
వ్యవధిలో అత్యంత వేగంగా పనులు చేపట్టి ప్రభుత్వం వీటిని అందుబాటులోకి
తెచ్చింది. 2019తో పోలిస్తే పీజీ సీట్ల సంఖ్య కూడా రెట్టింపైంది. ఉద్దానం
కిడ్నీ ఆస్పత్రిల్లో 41 మంది స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్యులను
రెగ్యులర్ పద్ధతిలో నియమించేందుకు కేబినెట్ ఆమోదించింది. ఉద్దానం ఆస్పత్రిని
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దనున్నాం.
పాఠశాల స్థాయి నుంచే ‘టోఫెల్’ : విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా
తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా టోఫెల్ పరీక్ష కోసం సన్నద్ధం
చేయనుంది. ఈ పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో ఒప్పందాన్ని మంత్రివర్గం
ఆమోదించింది. టోఫెల్ ప్రైమరీ (3–5 తరగతులు), టోఫెల్ జూనియర్ (6–10
తరగతులు) పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందచేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన
విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ టీచర్‌ను ప్రభుత్వం 3 రోజుల శిక్షణ కోసం
అమెరికాకు పంపిస్తుంది.