గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు : మానవ వనరుల అభివృద్ధి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, బంగారు
ఆంధ్రప్రదేశ్ స్థాపనే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది
పలికిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ,
సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
పేర్కొన్నారు. తోటపల్లి గూడూరు మండలం ఈదూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో జగనన్న
విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, జడ్పీ
చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ తో కలిసి
విద్యార్థులకు మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యా వ్యవస్థలో
పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని
చెప్పారు. పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు పిల్లలందరికీ రూ.2000
విలువచేసే జగనన్నకిట్లను అందించడం విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రికు ఉన్న
ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం అన్నారు. జిల్లాలో 1,92,743 మంది విద్యార్థులకు
38.55 కోట్లతో జగనన్న విద్యా కానుక కిట్లను అందజేస్తున్నట్లు చెప్పారు. ఒక
సర్వేపల్లి నియోజకవర్గం లోనే 26,500 మంది విద్యార్థులకు రూ. 5.30 కోట్లతో ఈ
కిట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం ఖర్చు మాత్రమే కాదని భావితరాల
భవిష్యత్తు కు పెట్టుబడి నిధిగా భావించాలని మంత్రి పేర్కొన్నారు. మనం
కన్నబిడ్డలకు ఏం కావాలో ఆలోచన చేసి వారికి నాడు నేడు, అమ్మ ఒడి, విద్యా కానుక,
వసతి దీవెన, విద్యా దీవెన వంటి అనేక సంక్షేమ పథకాలతో అన్ని సమకూరుస్తున్న ఘనత
ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. విద్యార్థులకు అవసరమైన ట్యాబ్లను అందించామని,
అలాగే టోఫల్ ప్రీ క్వాలిఫికేషన్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించేలా
విద్యార్థులకు ఇప్పటినుంచి శిక్షణ తరగతులు ఇస్తున్నామని, ఇందుకు సంబంధించి
టీచర్లను అమెరికాకు తీసుకెళ్లి ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం
చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు వినియోగించుకుని,
విద్యార్థులందరూ పోటీతత్వంతో విద్యలో రాణించాలని పిలుపునిచ్చారు. కేవలం పిల్లల
చదువుల ద్వారానే కుటుంబాల స్థితిగతులు మారుతున్నాయని, విద్యార్థులందరూ
తల్లిదండ్రులు గర్వపడేలా విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ మాట్లాడుతూ విద్య, వైద్యంకు సంబంధించిన
కార్యక్రమాల్లో పాల్గొనడం వ్యక్తిగతంగా తను చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు.
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా
విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. విద్య
అనేది ఒక ఉద్యోగం మాత్రమే కాదని జీవితంలో ఒక మార్పుకు నాంది విద్య అని
కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి జగనన్న విద్యా కానుక కిట్ ను
సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జడ్పీ చైర్ పర్సన్ అరుణమ్మ
మాట్లాడుతూ పిల్లలకు మేనమామలా ముఖ్యమంత్రి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని,
విద్యార్థులందరూ బాగా చదువుకుని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని
ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకముందు, వచ్చిన తరువాత అని మాట్లాడుకోవాల్సిన
పరిస్థితి ఉందని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో అసలు కనీస వసతులు ఉండేవి
కావని, ఇప్పుడు కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ రూపురేఖలను
సమూలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. ప్రతి అడుగులో, ప్రతి
మాటలో అన్నింటికీ చదివే కీలకమని, విద్యతోనే ఉన్నత శిఖరాలు సాధ్యమని చెప్పారు.
అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ
చేశారు. అలాగే పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఈదురు హైస్కూల్
విద్యార్థులు, జగనన్న ఆణిముత్యాలు గగన్, సుజిత, భారతికి నగదు బహుమతి,
జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని,
సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, ఎంపీడీవో హేమలత, ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి, హెచ్ఎం
భాస్కరయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు
పాల్గొన్నారు.