అప్పారావు
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పాటశాలల్లో ఉపాధ్యాయులు వివిధ మతాలకు,
కులాలకు, వర్గాలకు అతీతంగా విద్యా బోధన చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల
హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు సూచించారు. ఇటీవల కొన్ని
జిల్లాలలో ఉపాధ్యాయులు మత ప్రచారాలు చేస్తున్నట్టు కమిషన్ దృష్టికి
వచ్చిందని, హిందూ , క్రైస్తవం, ముస్లిం, ఇస్లాం, జైన్,సిక్కు మొదలగు ఏ విధమైన
మతాలను పాఠశాలల్లో ప్రచార , బోధించడం చేయకూడదని, అలా నిబంధనలకు విరుద్ధంగా
ప్రచారం చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశాలు జారీ
చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు నీతి, న్యాయం ,
సేవా గుణం వంటివి నేర్పించాలని తెలిపారు. విద్యార్దులు సున్నితమైన మనస్తత్వం
కలిగి ఉంటారని, వారి మనస్సులో కుల, మత, వర్గ భేదాలు వంటి బీజాలు నాటకుండా
చూడాలని, విద్యార్దులు మనోభావాలు దెబ్బతినేలా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది
ప్రవర్తించరాదని సూచించారు. విద్యార్దులు వారి తమ కుల, మత ఆచారాలకు,
సంస్కృతి,సంప్రదాయాలకు అడ్డు చెప్పరాదని వాటికి విరుద్ధంగా వారిపై ఒత్తిడి
తీసుకు రాకూడదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రయివేటు విద్యా
సంస్థలలో, వసతి గృహాల్లో , పునరావాస కేంద్రాలలో ఇటువంటి నిబంధనలను
ఉల్లంఘించినట్టు కమిషన్ దృష్టికి వస్తే తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు
తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.