ప్రజలకు ఊరటనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. వచ్చే
ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచకుండా
ఇప్పుడున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత రిటైల్
టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ
మండలి(ఈఆర్సీ)కి ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ
సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్)లు ప్రతిపాదించాయి. ఈ మేరకు
2023–24 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తోపాటు
రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలను ఉత్తర, దక్షిణ డిస్కంల డైరెక్టర్లు పి.గణపతి,
ఎస్.స్వామిరెడ్డి బుధవారం ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు
(టెక్నికల్) ఎం.డి.మనోహర్ రాజుకు సమర్పించారు. ప్రతిపాదనల వివరాలను చైర్మన్
శ్రీరంగారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా
చేసేందుకు రూ.2023–24లో రూ.54,060 కోట్ల వ్యయం అవుతుందని, ప్రస్తుత విద్యుత్
చార్జీలను యథాతథంగా అమలుచేస్తే రూ.43,525 కోట్లు మాత్రమే వస్తాయని రెండు
డిస్కంలు అంచనా వేసినట్టు తెలిపారు. రూ.10,535 కోట్ల లోటు వస్తుండగా ఆ మేరకు
విద్యుత్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆశిస్తున్నట్టుగా
పేర్కొన్నాయని వివరించారు.
ఉచిత, రాయితీ పథకాలు యథాతథం : రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయానికి
24 గంటల ఉచిత విద్యుత్, ప్రతినెలా ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూని ట్లు,
క్షౌరశాలలు, లాండ్రీలకు 250 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్,
పౌల్ట్రీఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్‌పై రూ.2 రాయితీ పథకాలు
యథాతథంగా వచ్చే ఏడాది అమలు చేస్తామని డిస్కంలు ప్రతిపాదనల్లో తెలిపాయి.
పెంచేదీ, తగ్గించేదీ మేమే నిర్ణయిస్తాం : ఈఆర్సీ
ప్రస్తుత విద్యుత్ చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని డిస్కంలు
ప్రతిపాదించినా వాటి ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత అవసరమైన మేర
చార్జీల తగ్గింపు లేదా పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ చైర్మన్ శ్రీ
రంగారావు స్పష్టం చేశారు. డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ వెబ్సైట్లో పెట్టి,
అన్నివర్గాల వినియోగదారుల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు.
బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని
చెప్పారు. ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ చార్జీలను
తగ్గించాలన్న విజ్ఞప్తులు తమ పరిశీలనలో ఉన్నాయని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం
తీసుకునే అవకాశం ఉందన్నారు. కాగా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను
పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై ఉందని శ్రీరంగారావు
పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు, ఎత్తిపోతల పథకాల బిల్లులను
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఉత్తర డిస్కం తీవ్ర ఆర్థిక
నష్టాల్లో ఉందని విలేకరుల ప్రశ్నలకు బదులుగా చెప్పారు. కొన్ని డివిజన్లలో
విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ) 50శాతానికి మించి
ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఎఫ్ఎస్ఏ పేరిట యూనిట్‌కు 30పైసలదాకా వడ్డనకు చాన్స్ : బొగ్గు ధరల
పెరుగుదలతో పడుతున్న అదనపు విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని ఇంధన సర్దుబాటు
చార్జీ (ఎఫ్ఎస్ఏ)ల రూపంలో ఎప్పటికప్పుడు వసూలు చేసేందుకు డిస్కంలు అనుమతి
కోరగా అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించినట్టు శ్రీరంగారావు
తెలిపారు. ప్రతి నెలా యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా 30పైసల వరకు ఈ అదనపు
చార్జీలు వసూలు చేసేందుకు ఈ నిబంధనలు అనుమతిస్తాయన్నారు. రాష్ట్ర
ప్రభుత్వానికి ముసాయిదా నిబంధనలను పంపామని, దీనిపై తుది ఉత్తర్వులు జారీచేశాక
అమల్లోకి వస్తాయని వివరించారు.
డిస్కంల ప్రతిపాదనల్లోని ముఖ్య గణాంకాలివీ
► 2023–24లో విద్యుత్ అవసరం అంచనా: 83,113 మిలియన్ యూనిట్లు
► వినియోగదారులకు విద్యుత్ విక్రయ అంచనా: 73,618 మిలియన్ యూని ట్లు (మిగతాది
నష్టాలు, ఇతర రూపాల్లో వినియోగం)
► వార్షిక ఆదాయ అవసరం అంచనా: టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.36,963 కోట్లు,
టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌కు రూ.17, 095 కోట్లు. మొత్తం రూ.54,060 కోట్లు.
► ప్రస్తుత విద్యుత్ చార్జీలతో రానున్న ఆదాయ అంచనా: రూ.43,525 కోట్లు
► ఆదాయ లోటు టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.3,211 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌కు
రూ.7,324 కోట్లు. మొత్తం లోటు రూ.10,535 కోట్లు. (ఈ మొత్తాన్ని రాష్ట్ర
ప్రభుత్వం నుంచి సబ్సిడీగా ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.)
► 2023–24లో సగటున ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరాకు అయ్యే వాస్తవ వ్యయ అంచనా:
రూ.7.34