ప్రతి విద్యార్ధిని గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దేందుకు కృషి
ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక
ప్రాధాన్యం ఇస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కళాశాల,
ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై గురువారం విజయవాడలో
నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
భాగంగా లైఫ్ స్కిల్స్ కోర్సులకు సంబంధించి 4, స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులకు
సంబంధించి 13 మొత్తం 17 కోర్సుల పాఠ్య పుస్తకాలను మంత్రి విడుదల చేసి
విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు శిక్షణ కోసం మంత్రి ఆధ్వర్యంలో
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ తో విద్యాశాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
‘కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అవార్డులను రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ
కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికీ 10 వేల చొప్పున బహుమానాన్ని
మంత్రి విద్యార్థులకు అందజేశారు. ‘స్టూడెంట్, ఫ్యామిలీ, కమ్యూనిటీ’ నినాదంతో
ఇన్ క్లూసివ్ సెంట్రీ లోగోను మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని
అమలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. మన రాష్ట్ర విద్యార్ధులను
గ్లోబల్ స్టూడెంట్ గా తీర్చిదిద్దడానికి వీలుగా ప్రీప్రైమరీ నుండి హైయ్యర్
ఎడ్యుకేషన్ వరకూ అన్ని స్థాయిల్లో అనేక విద్యాసంస్కరణలు అమలు
చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్
ప్రవేశపెట్టామన్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పరిశ్రమల
అవసరాలకు తగినట్లుగా ఉండాలనే స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత
ఇస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కి మంత్రివర్గంలో ఒక ప్రత్యేక పోర్ట్
ఫోలియో కూడా పెట్టామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉన్నత విద్య
కోర్సుతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కోర్సు కూడా జోడించి కొత్త కరిక్యులమ్
ఏర్పాటుకు కృషి చేసిన అధికారులందరినీ మంత్రి అభినందించారు. విద్యార్థుల
భవిష్యత్ కోసం ఆలోచనలు చేసి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.
కళాశాల విద్య కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో
విద్యార్థులు తమ చదువులు ముగించుకుని బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
దక్కించుకునేలా స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ కోర్సులను
రూపొందించామన్నారు. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం కొత్తగా 17 రకాల స్కిల్
డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ అంశాలను పాఠ్యపుస్తకాలుగా ముద్రించామని
తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆప్ లివింగ్ వ్యక్తి వికాస కేంద్ర ఇండియా
సీఈవో దిగ్విజయ్, కళాశాల విద్య శాఖ ఏజీవో డాక్టర్ సీహెచ్. తులసి, ఓఎస్డీ
డాక్టర్ పి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.