తాజా ప్రయోగంలో పలు కీలక మార్పులు
జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ భద్రంగా దిగడానికి తగిన ఏర్పాట్లు
ప్రయోగం సఫలమైతే భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక మలుపు
చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని
అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు
కొంతవరకు విజయం సాధించాయి. అంతరిక్ష నౌకలను క్షేమంగా పంపించాయి. చంద్రుడి
ఉపరితలంపై ఆయా అంతరిక్ష నౌకలు కాలుమోపాయి. ఈ జాబితాలో చేరాలని భారత్ సైతం
ఉవి్వళ్లూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి
సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా
సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి
రోవర్‌ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ
మిషన్ లక్ష్యం. చంద్రయాన్–3 స్పేస్‌క్రాఫ్ట్‌ను జీఎస్ఎల్వీ–ఎంకే–3 రాకెట్
ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్–3 మిషన్‌ను ఖచ్చితంగా సఫలం
చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు
అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి
పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు.
మీకు గుర్తుందా? చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను
మిగిల్చింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటార్‌తో వెళ్లిన
చంద్రయాన్–2 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది.
సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెపె్టంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయ్యింది.
ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రధాని మోదీ సమక్షంలో
కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్–2తో
పోలిస్తే చంద్రయాన్–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని
పరిశోధకులు చెబుతున్నారు. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని
అంటున్నారు.
ఆర్బిటార్, మిషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్
హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా చంద్రయాన్–2లో కేవలం ఒక్కటే
ఉంది. చంద్రయాన్–3లో ఇలాంటివి రెండు కెమెరాలు అమర్చుతున్నారు. చంద్రుడిపై
ల్యాండర్ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి. చంద్రయాన్–2లో 9 కీలక
పరికరాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి కక్ష్యలో ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉన్నాయి.
చంద్రయాన్–3 ప్రొపల్షన్ మాడ్యూల్లో కేవలం స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్
హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(ఎస్హెచ్ఏపీఈ) అనే పేలోడ్ కూడా ఉంటుంది. ఇతర
గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ
పరికరం అందజేస్తుంది.
చంద్రయాన్–3లో ల్యాండర్‌తోపాటు లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే(ఎల్ఆర్ఏ)ను
సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది
తోడ్పడుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం ఖాయమని సైంటిస్టులు ధీమా వ్యక్తం
చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో
ఒక కీలకమైన మైలురాయి కానుంది. చంద్రయాన్–2లో జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్
ఉపయోగించారు. చంద్రయాన్–3లోనూ ఇలాంటి రాకెట్‌ను వాడుతున్నారు. చంద్రయాన్–2
రాకెట్లో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ ఉన్నాయి. మూడో ప్రయోగంలో ల్యాండర్,
రోవర్ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్‌ను ఈ
తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో
క్షేమంగా ఉంది. సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్ కోసం
ఆర్బిటార్‌ను వాడుకుంటారు. చంద్రయాన్–2 వైఫల్యం నుంచి సైంటిస్టులు పాఠాలు
నేర్చుకున్నారు. అందుకే చంద్రయాన్–3లో కొన్ని మార్పులు చేశారు.