ఎమ్మెల్యే చేతులమీదుగా దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
విజయవాడ : విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు
అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా
డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యేని ఉపకరణాల కోసం పలువురు దివ్యాంగులు
విన్నవించడం జరిగింది. స్పందించిన ఆయన విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో
వృద్ధుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఐదుగురికి మూడు చక్రాల
సైకిళ్లు, మరో ఐదుగురికి వీల్ ఛైర్లు, 8 మందికి చెవిటి మిషన్లు మంజూరు
చేయించారు. గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మల్లాది విష్ణు
చేతులమీదుగా ఉపకరణాలను అందజేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం
ఎన్నోరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు
తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు అవసరమైన శారీరక, వైద్య, ఆర్థిక
తదితర అంశాల్లో తోడ్పాటును అందిస్తోందన్నారు. రాష్ట్రంలో 3 శాతం ఉన్న
దివ్యాంగుల రిజర్వేషన్ ను 4 శాతానికి పెంచిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అధికారంలోకి
వచ్చిన వెనువెంటనే దివ్యాంగులకు నెలవారీ పెన్షన్ ను రూ.3 వేలకు పెంచినట్లు
మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2,911 మంది
దివ్యాంగులకు పింఛన్ రూపంలో రూ. 87.33 లక్షలు ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటి
వద్దకే అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులలో మనోధైర్యం పెంచేందుకు ఏటా
క్రీడా పోటీలను కూడా జగనన్న సర్కారు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని అనేక మంది
వివిధ రంగాలు, వేదికలపై తమ ప్రతిభను చాటుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు.
అలాగే విభిన్న ప్రతిభావంతుల ఆర్థిక అభ్యున్నతికి ఒక్కొక్కరికి లక్ష నుండి ఐదు
లక్షల వరకు ఉపాధి రుణాలను ఈ ప్రభుత్వం అందజేస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థులకు చేయూత అందించేందుకు ల్యాప్ టాప్ లతో పాటు ఉపకార వేతనాల మంజూరు,
వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని,
అన్నిరంగాల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మనో సంకల్పం ముందు
వైకల్యం అవరోధం కాదని, మనోధైర్యమే విజయానికి అసలైన సాధనమని మల్లాది విష్ణు
పేర్కొన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం నిలబెట్టే ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ
ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మల్లాది విష్ణు కి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని
తెలియజేశారు.