హైదరాబాద్: ‘చేతులు జోడించి చెబుతున్నా. కాంగ్రెస్ పార్టీలో విభేదాలపై నాయకులెవరూ బయట మాట్లాడొద్దు.’ అని సీడబ్ల్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలు, వివిధ అంశాలపై చర్చించేందుకు మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన పలువురు నాయకులతో మాట్లాడారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్, మహేష్‌కుమార్ గౌడ్, షబ్బీర్‌అలీ, మల్లు రవి, పొన్నం ప్రభాకర్లతో కలిసి మాట్లాడారు. ‘పార్టీలో సమస్యలన్నీ సర్దుకున్నాయి. కాంగ్రెస్ నాయకులందరితో మాట్లాడాను. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో నాయకులంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే ప్రత్యర్థుల్ని ఓడించగలం.
2004 ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2014లో నిలబెట్టుకుంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇద్దరు తెరాస ఎంపీలతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేదా? కేసీఆర్ అనేక వాగ్దానాలు చేసి విస్మరించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. కాంగ్రెస్ నేతలను కేసీఆర్ కొనుగోలు చేశారు. జాతీయ స్థాయిలో భాజపా ఇదేపని చేస్తోంది. భారాస తీరు రాష్ట్రంలో ఒకలా,దిల్లీలో మరోలా ఉంది. పార్లమెంటు ఉభయసభల్లో భాజపాతో ఆ పార్టీ స్నేహం చేస్తోంది. రాష్ట్రంలో మాత్రం కుస్తీ చేస్తున్నట్లు నటిస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్‌కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలి. పరోక్షంగా కమలం పార్టీకి ఒవైసీ మద్దతు ఇస్తున్నారు.’ అని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ‘కరోనా సాకుతో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞాన్‌భూమి వద్ద, గాంధీభవన్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.