న్యూఢిల్లీ : విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు చేపట్టడంపై స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూములు ఉపయోగించకూడదని ఆదేశించింది. సినీ అవసరాలకు వినియోగించేందుకు 35 ఎకరాల భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం కేసు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. భూమిని ఎందుకు కేటాయించారు? ప్రస్తుతం లేఅవుట్ వేశారా? కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారని, అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకువచ్చారు. దీంతో స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి 11లోపు స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.