8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి
రెండో దశలో 3,000 మంది పనిచేసేలా ఐటీ క్యాంపస్
మూడోదశలో 200 గదులతో స్టార్ హోటల్ నిర్మాణం
జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ
ఏయూలో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌తో సహా పలు నూతన భవనాలకు సీఎం
ప్రారంభోత్సవం
గుంటూరు : దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌కు విశాఖ వేదిక కానుంది. 17
ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న
ఇనార్బిట్ మాల్ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
మంగళవారం భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా
పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు.
2026 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది.
250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000
మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మాణం కోసం పోర్టు
అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో
ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5
లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి
తెస్తారు. మూడో దశలో ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌ను 200 గదులు,
బాంకెట్ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని
నిరి్మంచనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించింది.
నేడు ఏయూలో పలు ప్రారంభోత్సవాలు : విశాఖ పర్యటన సందర్భంగా మొత్తం రూ.864.88
కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నిర్వహించనున్నారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం
శంకుస్థాపన చేస్తారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి
ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21
కోట్లతో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్ (ఏ హబ్)ను అభివృద్ధి చేశారు.
2025 నాటికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్
హబ్‌గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. విభిన్న రంగాలకు చెందిన ఇంక్యుబేషన్
సెంటర్‌తోపాటు ఎనెక్స్ సెంటర్స్, ప్రోటోటైపింగ్/మేకర్స్ ల్యాబ్, స్టూడెంట్
ఐడియేషన్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల
కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్,
బయోలాజికల్ మానిటరింగ్ హబ్‌ను సీఎం ప్రారంభిస్తారు. డిజిటల్ క్లాసులు,
డిజిటల్ పరీక్షల కోసం రూ.35 కోట్లతో అల్గోరిథమ్ పేరుతో ఏయూ డిజిటల్ జోన్
అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్‌ను నూతనంగా నిర్మించారు.
అంతర్జాతీయ అనలిటిక్స్‌లో మాస్టర్ పోగ్రాములు నిర్వహించేలా ఏయూ స్కూల్ ఆఫ్
ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్‌ను రూ.18 కోట్లతో 25,000 చదరపు అడుగుల
విస్తీర్ణంలో నిర్మించారు. మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ ప్యాకేజింగ్‌లో
నైపుణ్య శిక్షణ కోసం అవంతి ఫుడ్స్‌తో కలిపి రూ.11 కోట్లతో ఏయూ అవంతి ఆక్వా
కల్చర్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ హబ్‌ను నెలకొల్పారు. వీటిని
ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారు. నూతన భవనాల ద్వారా
2025 నాటికి ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో విభిన్న రంగాలకు అతిపెద్ద ఇంక్యుబేటర్
హబ్‌గా తయారు అవుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం 350కుపైగా
స్టార్టప్స్‌తోపాటు 150కు పైగా పేటెంట్లు, ట్రేడ్ మార్క్స్‌ను నమోదు
చేస్తుందని అంచనా. ఈ హబ్స్ ద్వారా కనీసం 2,000 మందికి ప్రత్యక్షంగా, 5,000
మందికి పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆరి్థక
వ్యవస్థకు రూ.480 కోట్ల వరకు సమకూరనుంది.
భారీ మానవహారంతో స్వాగతం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం
ఉదయం 10.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రోడ్డుమార్గంలో
సాలిగ్రామపురం వెళతారు. అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో రహేజా గ్రూప్స్
ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేస్తారు. అనంతరం నగరంలో జీవీఎంసీ చేపడుతున్న
మౌలిక సదుపాయాలు, రహదారులు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, స్మార్ట్ రోడ్డు,
యూరోపియన్ తరహా ఈట్ స్ట్రీట్స్, అమృత్ 2.0లో భాగంగా చెరువుల అభివృద్ధి
లాంటి రూ.135.88 కోట్ల విలువైన 50 పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం
ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ చేరుకొని విద్యార్థులకు కొత్త కోర్సులు, ఉపాధి
అవకాశాలు, స్టార్టప్‌లకు చేయూతనందించేలా రూ.129 కోట్లతో నిరి్మంచిన ఐదు
భవనాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు బీచ్ రోడ్డు నుంచి
బయలుదేరి 1.40కి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ
నుంచి తిరుగు పయనమవుతారు. విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఘన
స్వాగతం పలికేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఎయిర్‌పోర్టు
నుంచి ఇనార్బిట్మాల్ను నిరి్మంచే సాలిగ్రామపురం వరకు దాదాపు 9 కిలోమీటర్ల
పొడవునా రహదారికి ఇరువైపులా మానవహారంగా ఏర్పడి సీఎం జగన్‌కు స్వాగతం
పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నెడ్‌క్యాప్ చైర్మన్, ఉత్తర
నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు పర్యవేక్షిస్తున్నారు.