రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జవాబు
న్యూఢిల్లీ : విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్ఐఎన్ఎల్) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ అల్లాయ్ స్టీల్ ప్లాంట్, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్ ప్లాంట్లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సిపి సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖ ఉక్కు విక్రయానికి ఈవోఐ జారీ చేయలేదని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టే సమయం, అందుకు నిర్దేశించిన ధర, విక్రయానికి సంబంధించిన నియమ నిబంధనలు, నాన్-కోర్ అసెట్స్, మైన్స్, అనుబంధ పరిశ్రమలు, యూనిట్లు, జాయింట్ వెంచర్లలో ఆర్ఐఎన్ఎల్ వాటా వంటి అంశాలు పరిగణలోనికి తీసుకున్న తర్వాత మాత్రమే విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. సేలం స్టీల్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, భద్రావతి స్టీల్ ప్లాంట్లలో పెట్టుబడుల ఉపసంహరణపై బిడ్డర్లు ఆసక్తి చూపనందునే ఆయా స్టీల్ ప్లాంట్ల విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.