విజయవాడ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, విశాఖలో ఈనెల 30న కార్మిక
గర్జనకు సంఘీభావంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న
దీక్షలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
పిలుపునిచ్చారు. సీపీఐ- ఏఐటీయూసీ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో ఈనెల 23, 24
తేదీల్లో అన్ని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, 25వ తేదీన అన్ని కలెక్టరేట్ల
వద్ద దీక్షలకు దిగనున్నట్లు వెల్లడించారు. విజయవాడ దాసరిభవన్లో శుక్రవారం ఈ
దీక్షల పోస్టర్ ను ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీపీఐ
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె
రామాంజనేయులుతో కలిసి రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణ విలేకరులతో
మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు ఎంతో చారిత్రాత్మక చరిత్ర ఉందనీ, అలాంటి విశాఖ
ఉక్కును ప్రైవేట్వరం చేస్తుంటే సీఎం జగన్ మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కార్మికులు, కార్మిక సంఘాలు
పోరాటం చేస్తున్నాయని వివరించారు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని నడిపేలా
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఈ పోరాటం ప్రారంభమై
రెండేళ్లు అయినా మోడీ ఇంత వరకు స్పందించలేదని, దుర్మార్గంగా
వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటు కార్మికులంతా కలిసి ఉద్యమం
చేస్తున్నప్పటికీ సీఎం జగన్ చలనం లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరమైతే అక్కడ
భూమి స్వాధీనం చేసుకోవచ్చని జగన్ చూస్తున్నారన్నారు. ప్రభుత్వరంగ
సంస్థలన్నీ కారుచౌకగా ఆదానీ, అంబానీలకు మోడీ కట్టబెడుతున్నారని విమర్శించారు.
విశాఖ ఉక్కుపై మోదీకి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేని దుస్థితిలో జగన్ ఉండడం
విచారకరమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆదానికి అప్పగిస్తారనే
ప్రచారముందన్నారు.
కార్మికగర్జనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అదానీకి ఊడిగం చేసేలా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని రామకృష్ణ ధ్వజమెత్తారు. అన్నీ
ఆదానీ పాలేస్తే…ఏపీలో ప్రభుత్వం ఎందుకు?: ఓబులేసు ప్రభుత్వ ఆస్తులను
ప్రైవేట్రం చేయడానికి మోదీ, జగన్ తెగ తాపత్రయ పడుతున్నారని, ఆదానీకి
ప్రభుత్వరంగ సంస్థలను దోచిపెడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జి.ఓబులేసు విమర్శించారు. అన్నీ అదానీ పాలు చేస్తే…ఏపీలో ఇక ప్రభుత్వం
ఎందుకనీ ఆయన ప్రశ్నించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 30న విశాఖలో
జరిగే కార్మిక గర్జనకు తరలిరావలన్నారు. ఈ కార్మిక గర్జనకు మద్దతుగా ఈనెల 23,
24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, 25వ
తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద దీక్షలను పార్టీ శ్రేణులు, కార్మికలోకం
పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఓబులేసు పిలుపునిచ్చారు.