న్యూఢిల్లీ : విశాఖపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి
మీదుగా భోగాపురం వద్ద జాతీయ రహదారి-16 ని కలుపుతూ ప్రతిపాదిత 6 లేన్ల కోస్టల్
హైవే నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల
శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఏపీ ప్రతినిధుల
బృందం మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించినట్లు
తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఈ అంశంతో పాటు మరికొన్ని విషయాలను
వెల్లడించారు.
నిరుపేద విద్యార్దులకు ప్రైవేటు స్కూళ్లలో 25% రిజర్వేషన్
విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి నిరుపేద
విద్యార్దులకు ప్రైవేటు పాఠశాలల్లో 1 వ తరగతి అడ్మిషన్లో 25% రిజర్వేషన్
కల్పించడం అత్యంత ప్రశంసనీయమని విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి
విద్యార్థికీ తన బ్యాక్ గ్రౌండుతో సంబంధం లేకుండా ఉచితంగా, నిర్బందంగా విద్య
నేర్చుకునే హక్కు ఉందని అన్నారు.
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు అందరూ ఆహ్వానితులే
విశాఖలో మార్చి 3, 4 వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
కు ప్రతి ఒక్కరూ హాజరై రాష్ట్ర ప్రగతి, అందాలను ఆస్వాదించాలని ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆహ్వానించిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు
చేశారు. ఈ సందర్భంగా అందరినీ విశాఖ సదస్సులో కలుస్తానని సీఎం పేర్కొన్నట్లు
తెలిపారు.
ఏడాది బిడ్డకు గుండె మార్పిడితో పునర్జన్మ
ఏడాది వయసు గల బిడ్డకు గుండె మార్పిడి విజయవంతంగా నిర్వహించి తిరుపతి శ్రీ
పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ వైద్యులు ఊపిరి పోసారని విజయసాయి రెడ్డి
తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా
ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలో రెండు గుండె
మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన వైద్యులకు అభినందిస్తున్నానని ఆయన
తెలిపారు.