– 15వ తేదీ నుండి ఐదు రోజులపాటు వార్షికోత్సవాలు
– టీటీడీ, శ్రీశైలం దేవస్థానాలచే కళ్యాణోత్సవాలు
– మహిళలచే పారాయణ మహాయజ్ఞం
– ఉత్సవాలలో మహారుద్ర సహిత రాజశ్యామల యాగం
విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఐదు రోజులపాటు వార్షికోత్సవాలు చేపడుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధార్మిక సమ్మేళనాన్ని తలపించేలా ఉత్సవాలు చేపడుతున్నట్లు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ రాజశ్యామల యాగం చేపడుతున్నామని అన్నారు. ఐదు రోజులపాటు సాగే రాజశ్యామల యాగంలో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. వార్షికోత్సవ వేదికపై శ్రీశైలం దేవస్థానంచే 16వ తేదీన భ్రమరాంబికా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, 17వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంచే శ్రీనివాస కళ్యాణం, 18వ తేదీన పండితోత్తముల ఆధ్వర్యంలో వల్లీ కళ్యాణం ఉంటాయని వివరించారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణోత్సవాలు జరుగుతాయని తెలిపారు. దేవతారాధనలో భాగంగా పారాయణ మహాయజ్క్షం చేపడుతున్నామని అన్నారు. తొలిరోజు కనకధారా స్తోత్రం, రెండో రోజు ఆదిత్య హృదయం, లలితా సహస్రనామాలు, మూడో రోజు విష్ణు సహస్రనామాలు, నాలుగో రోజు హనుమాన్ చాలీసా పారాయణ ఉంటాయని తెలిపారు. భజన మండళ్ళు, పారాయణ బృందాలచే ఈ మహత్తర కార్యక్రమం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం 9 గంటలకు పారాయణ మహయజ్ఞం ప్రారంభమవుతుందని వివరించారు. కార్యక్రమాల్లో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవ సమయంలో 16వ తేదీన రధసప్తమి సందర్భంగా అరుణ పారాయణ, 18వ తేదీన సుబ్రహ్మణ్యేర స్వామిని ఆరాధిస్తూ రధోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. అంతేగాకుండా లక్ష్మీ గణపతి హోమం, మన్యుసూక్త హోమం, సుబ్రహ్మణ్య హోమం, సాంస్కృతిక ఆరాధనలో భాగంగా తొలిరోజు 15వ తేదీన శ్రీ శారద సామ గాన సభతో పాటు నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. బాలబాలికల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకు 18వ తేదీ సాయంత్రం ప్రత్యేకంగా చిన్నారులకు పౌరాణిక పాత్రధారణ పోటీలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. విష్ణు పరివారం, శివ కుటుంబాలలోని పాత్రలను ఎంపిక చేసుకుని వేదికపై శ్లోకాలు చదవాలని, పోటీల్లో పాల్గొనే వారికి బహుమతులు, సర్టిఫికేట్లు అందిస్తామని వివరించారు. వార్షికోత్సవాలలో నిత్యం రాజశ్యామల అమ్మవారికి, 15వ తేదీన దక్షిణామూర్తికి, 16న వనదుర్గా మాతకు, 17న దాసాంజనేయ స్వామికి, 18న షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామికి పీఠాధిపతుల చేతులమీదుగా విశేష అభిషేకాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమాల్లో పాల్గొనదలచిన భక్తులు మరిన్ని వివరాల కోసం పీఠంకు చెందిన 9440393333 నెంబరుకు సంప్రదించాలని సూచించారు. విభిన్నమైన సనాతన కార్యక్రమాలతో పండుగ వాతావరణం ఉట్టిపడేలా భక్తుల భాగస్వామ్యంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు