విశాఖపట్నం : విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
ముమ్మరంగా సాగుతున్నాయి. పీఠం ప్రాంగణంలో జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు
ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం
వార్షిక మహోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. వార్షికోత్సవాలకు పీఠాధిపతులు
స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర
సరస్వతీ స్వామి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపట్టారు. వందలాది మంది శాస్త్ర, ఆగమ,
వేద పండితులు వీటిలో పాల్గొంటారు. సచ్చిదానంద విద్వత్ సభ పేరుతో నిర్వహించే
శ్రౌత, శాస్త్ర మహాసభల్లో ఉత్తమ పాండిత్యం ప్రదర్శించిన పండితులకు స్వర్ణ కంకణ
ధారణ చేస్తారు. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ
చతుర్వేద హవనం నిర్వహించనున్నారు. ఐదు రోజులపాటు శత సహస్ర రాజశ్యామలా యాగం
లక్ష మూల మంత్రాలతో చేపడుతున్నారు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ప్రపంచ సార
తంత్ర గ్రంధం ఆధారంగా మహాయాగం జరుగుతుంది. అలాగే సర్వజనుల హితాన్ని
కాంక్షిస్తూ విశేష హోమాలు జరుగుతాయి. వీటిలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీ
మేధా దక్షిణామూర్తి హోమం, సుబ్రహ్మణ్య హోమం, మన్యుసూక్త హోమం, రుద్రహోమం
ఉంటాయి. 28వ తేదీన రధసప్తమి సందర్భంగా అరుణ పారాయణ, సూర్య నమస్కారములు
నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ 30వ తేదీ సాయంత్రం
రధోత్సవం, రాత్రి వల్లీ కళ్యాణం ఉంటాయి. రధోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద
ఎత్తున ఆదివాసీలు పీఠానికి తరలివస్తారు. ఆగమ శాస్త్రంపై అధ్యయనం జరగాలన్న
లక్ష్యంతో ఈ వార్షికోత్సవాలలో ఆగమ సదస్సులను కూడా నిర్వహిస్తున్నామని పీఠం
ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. 27 నుంచి మూడు
రోజులపాటు చాత్తాద వైష్ణవాగమ సదస్సు, 30, 31 తేదీల్లో శైవగమ సదస్సు
నిర్వహిస్తున్నట్లు వివరించారు. పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాల్లో
నిత్యం విశేష అభిషేకాలు, రాజశ్యామలా అమ్మవారికి రాత్రి 7 గంటలకు మహా మంగళ
హారతి ఉంటుందని అన్నారు. ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసేలా లబ్ద ప్రతిష్టులైన
కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామని తెలిపారు.
యాగానికి రాజకీయ, వ్యాపార ప్రముఖులు
విశాఖ శ్రీ శారదాపీఠం ఆధిష్టాన దైవం రాజశ్యామలా అమ్మవారి శత సహస్ర యాగంలో
పాల్గొనేందుకు అనేక మంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు వార్షికోత్సవాలకు తరలి
వస్తున్నారు. 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
యాగంలో పాల్గొనాలని సంకల్పించారు. అలాగే అదే రోజు ఉదయం పంజాబ్ గవర్నరు
బన్వర్‌లాల్ పురోహిత్, సాయంత్రం తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ హాజరవుతారు.
30వ తేదీన హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ గవర్నరు
బిశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నరు తమిళిసై కూడా వార్షికోత్సవాల్లో
పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు.