జెనిన్ : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై రెండు రోజులుగా
భారీ ఎత్తున చేపట్టిన సైనిక చర్యను ఇజ్రాయెల్ ముగించింది. అక్కడి నుంచి తన
దళాలను బుధవారం ఉపసంహరించుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ ఈ స్థాయిలో
దాడులు నిర్వహిచింది. డ్రోన్లు, బుల్డోజర్లు, బాంబు దాడులతో విరుచుకుపడింది.
ఇందులో కనీసం 12 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 140 మందికి పైగా
గాయపడ్డారు. పెద్ద ఎత్తున భవనాలు, వాహనాలు, ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. వేల
మంది పౌరులు తమ ఇళ్ల నుంచి తరలిపోయారు. ఈ ఆపరేషన్ సమయంలో ఓ ఇజ్రాయెల్
సైనికుడు కూడా మరణించారు. జెనిన్ శరణార్థుల శిబిరం ప్రాంతంలో తిష్ఠవేసిన
ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ చర్య చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టినట్లు పేర్కొంది. మరోవైపు సైనిక దళాల ఉపసంహరణ
సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రస్తుతం మా లక్ష్యాన్ని సాధించాం. అయితే ఇదే చివరి ఆపరేషన్ కాదు.
అవసరమైతే ఇలాంటి దాడులు మరిన్ని చేపడతాం’’ అని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదం
ఎక్కడ కనిపించినా దాన్ని నిర్మూలించేవరకూ విశ్రమించమని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ దళాల విరమణ కొనసాగుతున్న సమయంలోనే హమాస్ ఉగ్ర ముఠా అధీనంలో ఉన్న
గాజా నుంచి ఐదు రాకెట్లను ప్రయోగించారు. వీటిని ఇజ్రాయెల్ గగన రక్షణ
వ్యవస్థలు అడ్డుకొన్నాయి. దీనికి ప్రతిగా బుధవారం తెల్లవారుజామున గాజాపై
వైమానిక దాడులు చేశారు. మరోవైపు వెస్ట్‌బ్యాంక్‌లో ఇంకా పేలుళ్ల శబ్దాలు
వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రుల్లోకి బాష్పవాయువును
ప్రయోగించినట్లు ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ ఆరోపించింది.
మంగళవారం పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాది ఒకరు.. ఇజ్రాయెల్ రాజధాని
టెల్అవీవ్లో కారుతో ప్రజలపైకి దూసుకెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో
ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళకు గర్భస్రావమైంది. ఆ ఉగ్రవాదిని
భద్రతా దళ సిబ్బంది కాల్చి చంపారు.