కడప : రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇడుపులపాయ లోని వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తండ్రి ఆశీర్వాదం కోసమే ఇడుపులపాయ వచ్చా. రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్, ఆ పార్టీ సిద్ధాంతాలంటే ప్రాణంతో సమానం. వాటి కోసం ఎంతదూరమైనా వెళ్లేవారు. మన దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేదు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నిలబడాలి, దేశానికి మంచి జరగాలనే కాంగ్రెస్‌లో చేరా. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేంత వరకు మా పోరాటం ఆగదని తెలిపారు.
మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ కొన్ని పార్టీలు బానిసలు కావొచ్చు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ బానిస కాదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. సీనియర్‌నేత కేవీపీ రామచంద్రరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిలా వైఎస్ఆర్ పనిచేశారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆయన ఆశయాల కోసం, రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసేందుకే షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చారని వివరించారు. ఈ సందర్భంగా షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్‌లో చేరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప జిల్లాకు విచ్చేసిన షర్మిలకు కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీనియర్‌నేతలు శైలజానాథ్, తులసిరెడ్డి, గౌతమ్, అహ్మదుల్లా తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.