విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి
పథకాలతో మహిళల్లో ఆర్థిక చైతన్యం వస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లోని జింఖానా గ్రౌండ్
నందు శుక్రవారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత ఉత్సవాలలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్
బాలి గోవింద్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డప్పు కళాకారుల
ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సమాజం
అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం జగనన్న ప్రతి పథకాన్ని అక్కచెల్లెమ్మల
పేరిటే అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం
నిర్వీర్యం చేసిన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం
జవసత్వాలిస్తోందని పేర్కొన్నారు. మూడో విడత ఆసరా ద్వారా డివిజన్ లోని 112
గ్రూపులలో రూ. కోటి 14 లక్షల 8 వేల 677 రూపాయల నిధులు జమ చేసినట్లు తెలిపారు.
అత్యధికంగా దుర్గాదేవి పొదుపు సంఘానికి రూ. 2 లక్షల 42 వేల 971 రూపాయలు
రుణమాఫీ జరిగినట్లు చెప్పారు. ఇంత ఠంచనుగా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న
ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని ఎమ్మెల్యే తెలిపారు.
ఆడపడుచుల పేరిట ఇంటి పట్టాలు
పేదల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని గత పాలకులు, జన్మభూమి కమిటీలు పేదలను
నిలువునా మోసగించాయని మల్లాది విష్ణు ఆరోపించారు. కనీసం స్థలాలు కూడా లేకుండా
టిడ్కో ఇళ్ల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. కేవలం కాగితాలకే
ఇళ్లను చూపి ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల
రూపంలో దోచుకున్నారన్నారు. ఇందులో 6,576 ఇళ్లు 50 శాతం కూడా పూర్తికాలేదని,
5,341 మందికి కనీసం స్థలం కూడా చూపలేదన్నారు. అయినా కూడా నగరంలో 11,917 మందికి
ఆర్డర్ కాపీలను ఇచ్చారని దుయ్యబట్టారు. ఆ సమయంలో డబ్బులు కట్టలేక ఇంట్లోని
బంగారం తాకట్టు పెట్టేందుకు ప్రజలు ప్రైవేట్ బ్యాంకుల ముందు బారులు తీరడం
కలిచివేసిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన టిడ్కో లబ్ధిదారులకు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హత ఉన్న ప్రతిఒక్క
పేదవాడికి పారదర్శకంగా స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించి ఇస్తున్నారని మల్లాది
విష్ణు తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో రూ. 179.62 కోట్లు
వెచ్చించి 428.62 ఎకరాలలో నియోజకవర్గంలో 22,754 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు
చేసినట్లు వెల్లడించారు. అలాగే ఒక్కో ఇంటికి రూ. లక్షా 80 వేలు చొప్పున రూ.
409.57 కోట్లు మొత్తంగా రూ. 589.19 కోట్లు పేదల గృహాలకు కేటాయించినట్లు
వివరించారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి మహిళలు
ఆలోచన చేయాలన్నారు.