అమరావతి : రాష్ట్రంలోని నూర్బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా
ఇకపై వైఎస్సార్ షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు
సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముస్లింలకు వైఎస్ జగన్ ప్రభుత్వం
వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది.
ఇస్లాం మతాన్ని ఆచరించే నూర్బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులను
బీసీ–బీగా పరిగణిస్తుండటంతో వారికి రూ.50వేలు మాత్రమే వస్తున్నాయి.ఈ
నేపథ్యంలో తమకు కూడా వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.లక్ష చొప్పున మంజూరు
చేయాలని దూదేకుల ప్రతినిధులు ఇటీవల సీఎం జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం
అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా వీరిని ముస్లింలుగానే పరిగణించి లబ్ధిని
చేకూర్చేలా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై ఆ వర్గాలు సీఎంకు
కృతజ్ఞతలు తెలిపాయి.