గుంటూరు : వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు
ప్రవేశపెట్టింది మోసఫెస్టోనని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని
ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే
సిగ్గేస్తోందని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎంతమంది పేదలను దనవంతులుగా
చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్ధానాలు చేసి మోసగించిన వ్యక్తి
చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో.. చంద్రబాబు మోసఫెస్టోపై
ఇంటింటా చర్చ జరగాలని అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం
నిర్వహించారు. ఈ చర్చలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్కా
మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు,
ఆర్థికరంగ విశ్లేషకులు పాపారావు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమారెడ్డి
వెంకటేశ్వర్లు, యేసు రత్నం, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య,
ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘రాజకీయాల్లో సీఎం జగన్ ట్రెండ్
సెట్టర్. ఆయన పాలన ప్రజలకు స్వర్గం.. బాబు, ఎల్లో మీడియాకు నరకం. రాజకీయ
నాయకులు భష్టు పట్టించిన మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చిన వ్యక్తి సీఎ జగన్.
జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అందులో పేర్కొన్నట్లే
సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నాం. మీకు మేలు చేస్తేనే
ఓటేయమని అడుగుతున్నాం. పేదలకు మేలు చేస్తే ఓటేయండి..లేకపోతే వద్దని దమ్ముగా
చెప్పిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్రెడ్డి’ అని అంబటి వ్యాఖ్యానించారు.