సిబ్బంది నియామకం విషయంలో తమ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ
కు సంబంధించిన అన్ని విభాగాల అధిపతులతో శుక్రవారం మంత్రి విడదల రజిని
ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు
మెరుగైన వైద్యం పూర్తి ఉచితంగా, వేగంగా అందించేందుకు జగనన్న చిత్తశుద్ధితో
పనిచేస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని ఉంచేందుకు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఎంత ఖర్చు చేయడానికైనా
వెనుకాడటం లేదని తెలిపారు. నెలకు రూ.3 లక్షలకు కంటే కూడా ఎక్కవ
చెల్లించేలా బిడ్డింగ్ పద్ధతి ద్వారా నిపుణులైన వైద్యుల నియామకం చేపడుతున్న
ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల
వరకు ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై
ఉందని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా
సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.ఫ్యామిలీ ఫిజిషియన్ వివరాలన్నీ పక్కాగా ఉండాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంచలన
కార్యక్రమాల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం కూడా ఒకటని మంత్రి
విడదల రజిని తెలిపారు. ఈ విధానం కోసం అభివృద్ధి చేసిన యాప్‌లలో డేటా
ఎంట్రీ పక్కాగా ఉండాలని సూచించారు. ప్రతి ఎంఎంయూ ద్వారా అందించిన ఓపీ సేవల
సంఖ్య, చేసిన వైద్య పరీక్షలు, పంపిణీ చేసిన మందులు.. వీటన్నింటినీ
పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఆన్లైన్లో ఉన్న డేటాతో …. ఈ
వివరాలన్నీ సరిపోలేలా ఉండాలని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య
విధానంలో భాగంగా వైద్యాధికారులు తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలు,
పాఠశాళలలను సందర్శించాల్సిందేనని, ఈ వివరాలన్నీ ఆన్లైన్లో
నమోదుకావాలని సూచించారు. ఈ నూతన వైద్య విధానం కోసం అతి త్వరలో మరో 260
ఎంఎంయూలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
రోగులకు నాణ్యమైన భోజనం అందాలి
రాష్ట్ర వ్యాప్తంగా రోగులకు అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన భోజనం అందేలా
చూడాలని అధికారులను ఆదేశించారు. 2012 తర్వాత తొలిసారి డైట్ బిల్లులు భారీగా
పెంచిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగనన్న చరిత్రలో నిలిచిపోతారని
గుర్తుచేశారు. గతంలో కేవలం రూ.40 మాత్రమే చెల్లించేవారని, జగనన్న
ఇప్పుడు రూ.80 చెల్లిస్తురన్నారని తెలిపారు. పేదలకు మంచి చేసే విషయంలో
జగనన్న ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. అన్ని ఆస్పత్రుల్లో మందులు
కచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పారు. శస్త్రచికిత్సలు అందించే
విషయంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పారు. వైద్య
పరీక్షలు చేసేందుకు కావాల్సిన అన్ని రియేజంట్లు ఆస్పత్రుల్లో అందుబాటులో
ఉండాలన్నారు.