రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా జవాబు
న్యూఢిల్లీ : అధునాతన వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో రూ. 24,300 కోట్ల రూపాయలతో అనేక ప్రోత్సాహక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ 2020-21 నుండి 2022-23 వరకు 2,2274 డాలర్ల విలువైన వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోగా దేసం నుంచి కేవలం 8846 డాలర్ల విలువైన వైద్య పరికరాలను మాత్రమే ఎగుమతి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో దేశీయంగా అధునాతన వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.
దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రూ.3240 కోట్ల రూపాయలతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీంను (పిఎల్ఐఎస్) రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన కంపెనీలకు దేశీయంగా ఉత్పత్తి చేసిన వైద్య పరికరాల అమ్మకాలపై 5% నగదు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. రేడియో థెరపీ, ఇమేజింగ్ డివైసెస్, ఎనస్థీషియా, కార్డియో రెస్పిరేటరీ, క్రిటికల్ కేర్, ఇంప్లాంట్స్ వంటి నిర్దేశిత సెగ్మెంట్లలో 5 సంవత్సరాల కాలానికి ఈ పథకం ద్వారా ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 26 కంపెనీలకు ఆథరైజేషన్ మంజూరు చేసినట్లు ఖుబా చెప్పారు. అలాగే 15 వేల కోట్ల రూపాయలతోతో 2020-21 నుండి 2028-29 వరకు 9 సంవత్సరాల కాలానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం ఫర్ ఫార్మాస్యూటికల్స్‌ను అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద ఎంపికైన 55 కంపెనీలకు 6 సంవత్సరాల పాటు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రమోషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్ పార్క్ పథకం కింద ఎంపికైన మెడికల్ పార్కుల్లో సాధారణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.400 కోట్ల రూపాయలతో 2020-21 నుండి 2024-25 వరకు 5 సంవత్సరాల కాలానికి మరో పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వైద్య రంగంలో ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) కోసం పీఆర్ఐపీ (ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మా మెడిటెక్ సెక్టార్ పేరుతో 2023-24 నుండి 2027-28 వరకు 5 సంవత్సరాల కాలానికి వైద్యశాఖ మరో పథకాన్ని రూపొందినట్లు మంత్రి తెలిపారు. మెడికల్ డివైస్ రంగంలో మానవ వనరుల అభివృద్ధికి రూ.480 కోట్ల రూపాయలతో 2023-24 నుండి మూడు సంవత్సరాల కాలానికి ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ నూతన పథకం ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు.