తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం
ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు
బంగారు కవచంలో పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం
పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీ
మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి
వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం
నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు.
అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సహస్రదీపాలంకార
సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆ తరువాత ఆలయ
నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో
ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, విజివో బాలి రెడ్డి,
తదితరులు పాల్గొన్నారు.