“జీవీఎల్ రిపబ్లిక్ ఉత్సవం”లో బీచ్ ఒడ్డున 400 మీటర్ల పొడవైన జాతీయ జండాతో అబ్బురపరచిన “కలర్స్ వాక్”
ప్రధాని నరేంద్ర మోడీ పని విధానమే యువ భారత్ కు ఆదర్శం: జీవీఎల్
విశాఖపట్నం : విశాఖపట్నం ఆర్కే బీచ్ లో రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అధ్వర్యంలో నిర్వహించిన “జీవీఎల్ రిపబ్లిక్ డే ఉత్సవం” ఘనంగా జరిగింది. సుమారు 3వేల మంది యువతీ యువకులతో శుక్రవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు “వైబ్రంట్ వైజాగ్” కోసం 400 మీటర్ల పొడవైన జాతీయ జండాతో “కలర్స్ వాక్” అత్యంత వైభవంగా జరిపారు. నాలుగు వందల మీటర్ల జాతీయ జెండా భూ సమాంతర ఆవిష్కరణతో
రిపబ్లిక్ డే ఉత్సవం ఆయన ప్రారంభించారు. కేరింతలు కొడుతూ జాతీయ గీతాలు పాడుతూ వందే భారత్ నినాదాలతో యువతరం అంతా ఆ జెండాను సముద్రపు ఒడ్డున ఆకాశం దిశగా చూపుతూ ఇసుకలో కిలోమీటరు దూరం నడుస్తూ నినదించారు. ఉదయం ఆరు గంటల నుండే బీచ్ లో వేలాది నగర వాసులు, విద్యార్థులు క్రమశిక్షణతో “జీవీఎల్ రిపబ్లిక్ ఉత్సవం”లో పాల్గొని త్రివర్ల పతాక రంగుల టీషర్టులు ధరించి సముద్ర తీరాన్ని జాతీయ వేదికగా ఆలరింపజేశారు. ఉత్సవ్‌లో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది అక్కడ పంచబడిన “జీవీఎల్ 4 వైజాగ్” జెండా రంగు టీ షర్టులు ధరించి జెండా వందనం చేశారు. తొలుత జాతీయ గీతాలాపనతో వేదిక ప్రారంభం కాగా, బాల బాలికలు జెండాలు పట్టుకుని వందే మాతరం పాడుతూ నృత్యం చేశారు. ఎంపీ జీవీఎల్ దంపతులు కూడా వారితో కలిసి మొత్తం సభికులను ఉత్తేజ పరిచారు. ఈ సందర్బంగా జీవీఎల్ అందరికీ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం భారతీయులతో పాటు ప్రపంచదేశాలలోనే వేడుకగా మారిందని, పొరుగు దేశాలు కూడా మన గణతంత్ర దినోత్సవాన్ని గౌరవ ప్రదంగా నిర్వహించుకోవడం కేవలం ప్రధాని నరేంద్ర మోదీ పని తనానికి, ప్రజాస్వామ్య పాలనకు తార్కాణంగా నిలుస్తుందని, పనితనం విషయంలో చెప్పుకోదగిన ఆదర్శమూర్తిగా నిలిచిన నరేంద్ర మోదీని భారతీయ యువత ఆదర్శంగా తీసుకుని ఆయనను అనుసరించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు యువతరానికి పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాల ఉత్సవాలు విజయవంతమైన తర్వాత జనవరి 26, 27 తేదిల్లో యువతరానికి ఆటవిడుపుగా ఏర్పాటు చేసిన “జీవీఎల్ రిపబ్లిక్ ఉత్సవాన్ని” జరుపటం పై పలువురు ప్రసంగించారు. వేలాదిగా జెండాలు చేత పట్టి చేసిన ప్రదర్శన, సృత్యాలతో సముద్ర తీరం పులకించింది. జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. “జీవీఎల్ 4 వైజాగ్” బృందం యువతి యువకులు తమ తమ మిత్ర బృందాలతో కలిసి దేశ భక్తిని ప్రదర్శించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమములో బీజేపీ మాజీ శాసన సభ్యులు విష్ణుకుమార్ రాజు, మాజీ సైనికులు, వీర మహిళలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.