తణుకు : ప్రభుత్వ పాలన మొచ్చి టీడీపీ, జనసేన నుంచి భారీ సంఖ్యంలో కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో బుధవారం మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 100 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరగా, వీరిని మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైసీపీ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువుల రాష్ట్రంగా మార్చేసిన ఘనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో 16వ స్థానంలో ఉన్న విద్యను ఈ ప్రభుత్వంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ఈ సీఎం విద్య, వైద్యం, ఆరోగ్యానిక పెద్ద పీట వేసారన్నారు. నాడు-నేడు పథకం ద్వారా రాష్ట్రంలో పాఠశాలలను విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉండాలని మంచి సంకల్పంతో చదువులకు పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వ పాలకులు వాళ్ల కులస్తులకే సంక్షేమాన్ని అందించగా ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల అందరికీ సంక్షేమం అందాలని చెప్పిన దేశంలోనే గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా ప్రతీ పేదవాడు సంతోషంగా జీవించాలన్న తపనతో సీఎం స్వచ్చమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ రూపంలో లబ్దిదారుల ఖాతాలో నేరుగా నగదు జమ చేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయన్నారు. మీ ఇంటిలో జగనన్న ప్రభుత్వం వచ్చాక మీకు మేలు జరిగితేనే రానున్న ఎన్నికలలో వైఎస్సార్సీపీకి ఓటు వేయండిని అని దమ్ము, ధైర్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వంపై పచ్చమీడియా, ప్రతిపక్షపార్టీలు ఏకమై అసత్యప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. మీఇళ్లకు రెండు కండువాలు కప్పుకుని ఓట్లు అడగడాని మీ తలుపులు తడతారని వాళ్ల నేరపూరిత మాటలు నమ్మవద్దని, మీరు అంతా మీకు మేలు జరిగే ప్రభుత్వానికే ఓటు వేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రేలంగి ఉపసర్పంచ్ పులుపు అక్కమాంబ, రేలంగి పార్టీ అధ్యక్షులు పులుపు అనీల్, రేలంగి ఎంపీటీసీ మొట్ల కిరణ్మయి, రేలంగి సొసైటీ అధ్యక్షులు నడిపల్లి రాంబాబు రాజు, వైసీపీ నాయకులు, గాదిరాజు బుజ్జి, వడ్డి మార్కండేయులు, యూత్ ఉపాధ్యక్షుడు వీరమల్లు ఫణీంద్ర, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.