కొనసాగుతున్న సర్దుబాట్లు
ఎమ్మెల్యేలతో సంప్రదింపులు..చర్చలు
విజయవాడ : వైసీపీ లో సమన్వయకర్తల మార్పుచేర్పులపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా ఆ పార్టీ ముఖ్యనేతలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికగా పలువురు ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. మరోవైపు సీఎం జగన్‌ను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్చూరు, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆమంచి కృష్ణమోహన్, ఆడారి ఆనంద్ కలిసి మాట్లాడారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అయితే ఎంపీగా పోటీచేసేందుకు ఆయన సుముఖంగా లేరు. గంగాధర నెల్లూరులో తనకు కాకపోతే కనీసం తన కుమార్తె కృపాలక్ష్మికైనా టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆయన తన కుమార్తెను వెంటబెట్టుకుని సీఎంను కలిసి మాట్లాడారు. అనకాపల్లిలో పార్టీ ఇన్ఛార్జిగా భరత్‌ను నియమించడంతో టికెట్ లేకుండా పోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం తన పుట్టినరోజు అని సీఎంను కలిసి మాట్లాడారు. ఆడారి ఆనంద్ విశాఖ పశ్చిమలో పార్టీలో తనకున్న ఇబ్బందులు, ఆ నియోజకవర్గంలో ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు. ఈ నెల 27న ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లపై విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సీఎంను కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రావాలని సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు వచ్చారు. అయితే సాయంత్రం అపాయింట్మెంటును మంగళవారానికి వాయిదా వేసినట్లు అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు. మరోవైపు మంత్రి పినిపే విశ్వరూప్ (అమలాపురం), ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్ (దర్శి), వాసుపల్లి గణేష్ (విశాఖ దక్షిణ), మేకా ప్రతాప్ అప్పారావు (నూజివీడు), కాటసాని రామిరెడ్డి (బనగానపల్లె), కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ భరత్ తదితరులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిలను కలిసి తమ నియోజకవర్గాల్లో పనులపై మాట్లాడారు. వీరిలో కొందరి స్థానాల్లో కొత్త సమన్వయకర్తలను నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.