వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్
ఇప్పటినుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
కార్యకర్తలను సమాయత్తం చేయడంపై దృష్టి
వివరాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ
గుంటూరు : ఏపీలో ప్రధాన పార్టీల దృష్టి వచ్చే ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది.
అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల దిశగా తమ కార్యాచరణలో
నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా
సమావేశం కానున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్
నిర్వహించనున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాబోయే
అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడమే ఈ వర్క్ షాప్ ప్రధాన
ఉద్దేశమని తెలిపారు.
పార్టీలోని వివిధ స్థాయిల్లో ఉన్న నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడమే
లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, పార్టీలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో
నడుచుకుంటే గత ఎన్నికల మాదిరే వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని బొత్స
అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు అభిప్రాయభేదాలను పక్కనబెట్టాలని హితవు పలికారు.
కొద్దిపాటి అసంతృప్తి ఉన్నా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.