గుంటూరు : శాసన మండలిలో ఖాళీ అయిన, త్వరలో ఖాళీ కాబోయే 18 ఎమ్మెల్సీ స్థానాలకు
అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రాంతాలు, సామాజికవర్గాలు,
పార్టీకి అందించిన సేవలు, పార్టీ బలోపేతం ప్రామాణికంగా అభ్యర్థులను పార్టీ
అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ పదవులకు తీవ్ర పోటీ
ఉన్నా సామాజిక సమతుల్యత కోసం అర్హులైన వారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినట్లు
పార్టీ వర్గాలు ప్రకటించాయి. శాసన మండలిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు
అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించింది. ప్రాంతాలు, సామాజిక వర్గాలు,
పార్టీకి అందించిన సేవలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు
చేశారు. జగన్ ఆమోదముద్ర వేసిన అనంతరం స్థానిక సంస్ధలు, ఎమ్మెల్యేలు, గవర్నర్
కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల
రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
స్థానిక సంస్థల కోటాలో : స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
కాగా వాటికి అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం
నియోజకవర్గం నేత యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావుకు ఎమ్మెల్సీ
అవకాశం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గ నేత, శెట్టి
బలిజ సామాజికవర్గానికి చెందిన కుడిపూడి సత్యనారాయణకు ఎమ్మెల్సీ అవకాశం
కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ అవకాశం
కల్పించారు. ఈ జిల్లాలోని తణుకు నియోజకవర్గ నేత, కాపు సామాజికవర్గానికి చెందిన
వంకా రవీంద్రనాథ్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అదేవిధంగా ఇదే జిల్లాకు చెందిన
పాలకొల్లు నియోజకవర్గ నేత శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన కవురు
శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.పొట్టి శ్రీరాములు నెల్లూరు
జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన నేత, మాల సామాజికవర్గానికి చెందిన
మేరుగ మురళీధర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ నేత, బీసీలోని వన్నె రెడ్డి
సామాజికవర్గానికి చెందిన సిపాయి సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ అభ్యర్థిగా
ప్రకటించారు. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గానికి
చెందిన నేత, రెడ్డి సామాజికవర్గానికి చెందిన పి. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ
పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన వాల్మీకీ బోయ సామాజిక వర్గానికి
చెందిన ఎ. మధుసూధన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా
పెనుగొండ నియోజకవర్గంలోని వాల్మీక బోయ సామాజికవర్గానికి చెందిన ఎస్. మంగమ్మకు
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మాజీ ఎంపీ గంగాధర సతీమణి అయిన మంగమ్మకు
ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే బోయ సామాజికవర్గానికి మేలు జరగడం తద్వారా జిల్లాలో
వైఎస్సార్సీపీ బలోపేతమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కోటాలో : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం అభ్యర్థులను సీఎం
జగన్ ఖరారు చేసి ఆమోదముద్ర వేశారు. 7 ఖాళీలు ఉండగా వాటన్నింటికీ అభ్యర్థులను
ప్రకటించారు. శాసనసభలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్న దృష్ట్యా అన్ని పదవులను
వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ పరిస్ధితుల్లో తొలి నుంచీ పార్టీకి
సేవలందించిన నేతలను ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. విజయనగరం
జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ నేత, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన పెనుమత్స
సూర్యనారాయణ రాజుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.
బాపట్ల జిల్లాకు చెందిన చీరాల నియోజకవర్గ నేత, పద్మశాలి సామాజికవర్గానికి
చెందిన బీసీ మహిళా నేత పోతుల సునీతకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని
సీఎం జగన్ నిర్ణయించారు. విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణ నియోజకవర్గానికి
చెందిన వాడ బలిజ సామాజికవర్గానికి చెందిన బీసీ నేత కోల గురువులను శాసన మండలికి
పంపాలని సీఎం నిర్ణయించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం
నియోజకవర్గ నేత మాదిగ సామాజికవర్గానికి చెందిన బొమ్మి ఇస్రాయిల్ను ఎమ్మెల్సీ
అభ్యర్థిగా ప్రకటించారు.ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ నేత, ఇటీవలే
తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వడ్డీ సామాజికవర్గానికి చెందిన
జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీగా పంపాలని సీఎం నిర్ణయించి ప్రకటించారు. గుంటూరు
జిల్లాలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వడ్డెర సామాజికవర్గానికి
చెందిన చంద్రగిరి ఏసురత్నంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. గతంలో గుంటూరు
పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఏసురత్నం.. పార్టీకి అందించిన సేవలను
గుర్తించి పదవి ఇవ్వాలని నిర్ణయించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన కమ్మ సామాజికవర్గానికి
చెందిన మర్రి రాజశేఖర్‌కు ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి అవకాశం లభించింది.
చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ స్థానంలో గత
ఎన్నికల్లో విడదల రజినికి చివరి నిమిషంలో సీటు కేటాయించారు. అధికారంలోకి
రాగానే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని సీఎం జగన్
బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఎట్టకేలకు ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నెరవేర్చేలా
చర్యలు తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
గవర్నర్ కోటాలో : త్వరలో శాసనమండలిలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు
ఖాళీ కానుండగా వాటికీ ముందస్తుగా అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ
కోటాలో ఒకరు ఎస్టీ, ఒకరు బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అల్లూరి
సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ నేత ఎరుకల (ఎస్టీ) సామాజికవర్గానికి
చెందిన కుంభా రవిబాబును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని సీఎం
నిర్ణయించారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీకి చెందిన నేత,
మత్స్యకార సామాజికవర్గంలోని వదబలిజ వర్గానికి చెందిన కర్రి పద్మశ్రీకి గవర్నర్
కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.
సామాజిక న్యాయానికి వైసీపీ కట్టుబడి ఉందని, బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీల
సాధికారతకు మొదట్నుంచీ పెద్దపీట వేస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల
రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 మంది
బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, నలుగురు ఓసీలు ఉన్నట్లు తెలిపారు. ఎంపిక
చేసిన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా బీఫాంలు అందజేయనున్నారు.
వీరంతా వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ
వర్గాలు తెలిపాయి.