గుంకలాంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
విజయనగరం : రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహనరెడ్డి తీసుకున్న చర్యల ఫలితంగా వ్యవసాయం పట్ల మక్కువ
పెరిగిందని, డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
వ్యవసాయానికి, రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత
నిస్తోందని చెప్పారు. విజయనగరం మండలం గుంకలాం గ్రామంలో ధాన్యం కొనుగోలు
కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ధాన్యం ఇచ్చిన పదిమంది రైతులకు
నగదు బదిలీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో
కోలగట్ల మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను
వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వర్షాకాలం వస్తే చాలు రైతులకు కష్టాలు
మొదలయ్యేవని అన్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరా నుంచి ధాన్యం సేకరణ
వరకు రైతులు ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేదని అన్నారు. తమ ప్రభుత్వ
హాయంలో, గ్రామంలోనే, రైతు ముంగిటకే విత్తనాలను, ఎరువులను సరఫరా
చేయడంతోపాటుగా, కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
ధాన్యం కొనుగోలు జరిగిన 21 రోజుల్లోపే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం
జరుగుతుందన్నారు.
తన పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్
మోహనరెడ్డి, అధికారంలోకి వచ్చాక, రైతుకు ఎటువంటి కష్టాలు ఎదురు
కాకూడదన్న ఉద్దేశంతో, ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం
చుట్టారని, దానిలో రైతు భరోసా కేంద్రం ఒకటని చెప్పారు. గతేడాది ధాన్యం
కొనలేక ప్రక్కరాష్టం చేతులెత్తేస్తే, మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి
జగన్, రైతుకు అండగా నిలిచి ప్రతీగింజా కొనుగోలు చేసి, రైతు కష్టానికి
తగిన ప్రతిఫలాన్ని అందించారని, పరిపాలనలో ఈ తేడాను ప్రతీఒక్కరూ
గమనించాలని కోలగట్ల కోరారు. జిల్లా వ్యవసాయాధికారి విటి రామారావు, పౌర
సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మీనాకుమారి, ఎఎంసి ఛైర్మన్ నడిపేన
శ్రీనివాసరావు, జొన్నవలస పిఏసిఎస్ అధ్యక్షులు కెల్ల త్రినాధ్, ఎంపిపి
మామిడి అప్పలనాయుడు, జెడ్పిటిసి కెల్ల శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్
కె.నాగరాజు, ఏఓ ఉమామహేశ్వర్రావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎడిఏ
నాగభూషణరావు, తాశిల్దార్ బంగార్రాజు, ఎంపిడిఓ జి.వెంకటరావు, హౌసింగ్ ఏఈ
జి.వర్మరాజు, ఎపిఎం అరుణ, వైస్ ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, స్థానిక
నాయకులు, అధికారులు పాల్గొన్నారు.