శ్రీకాకుళం : వ్యవసాయం లాభసాటిగా ఉండాలని, రైతుకు నిరంతరం అండదండగా ప్రభుత్వం
ఉంటూ సహాయ సహకారలు అందజేయడం జరుగుతుందని మాజీ ఉపముఖ్యమంత్రి, నరసన్నపేట
శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ రైతులకు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ
సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో
బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాధారిత రాష్ట్రం మనదని,
అందుకే మన ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. అలాగే
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందివుచ్చుకునేలా యాంత్రికరణ వైపు రైతులు అడుగులు
వేసేలా జిల్లా యంత్రాంగం కృషిచేస్తుందని వివరించారు. తాను కూడా రైతు బిడ్డనే
అయినప్పటికి తనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నారు. అధికారుల సూచనలు, సలహాలు
పాటించాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో తీసుకున్న
నిర్ణయాలు దిగువ స్థాయి వరకు తెలియజేయడం ద్వారా సరైన ఫలితాలు వస్తాయని ఆశాభావం
వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ
రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు వేగవంత జరిగిందన్నారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆర్.బి.కె
స్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి రైతులకు చేరవేయాలని తెలిపారు. విత్తనాభివృద్ధి
సంస్థ జిల్లా మేనేజర్, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు
సమన్వయంతో ముందుకువెళ్లాలని తెలిపారు. నీటి సాంద్రతను బట్టి రైతులు
వేసుకోవాల్సిన పంటలపై అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల అవసరాలను గుర్తించి
అందుకు తగిన విధంగా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే
1962 సంచార పశువైద్య వాహనాలు తరుచు గ్రామాలో పర్యటించి పశువులకు వైద్యం
అందజేసేలా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు.