రూ.16కోట్లు విలువైన 52 పరికరాలు అందజేత
నరసన్నపేట : వ్యవసాయA రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి,
ప్రతి రైతుకు వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనేలా ప్రభుత్వం పని చేస్తున్నదని
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. నరసన్నపేట వైఎస్ఆర్ జంక్షన్
వద్ద వైయస్సార్ యంత్ర సేవా పథకాన్ని శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు.
రూ.16 కోట్ల విలువైన 52 పరికరాలను ఈ సందర్భంగా రైతు గ్రూపు సభ్యులకు
అందజేశారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్
హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, రైతులకు ట్రాక్టర్లు, కంబైన్
హార్వెస్టర్ల వంటి వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని,
రైతులు గత రెండేళ్లుగా వీటి ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని వివరించారు.
వీటి ద్వారా కూలీల కొరతకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయిందన్నారు.
రాష్ట్రంలోని 10,444 ఆర్బీకేల పరిధిలో రైతులు ఒక గ్రూప్‌గా ఏర్పడి, ఈ
వ్యవసాయ పరికరాలను తక్కువ ధరకే ఇతర రైతులకు అద్దెకిచ్చేలా ఈ
కార్యక్రమాన్ని రూపొందించామని, గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన
నిర్వచనం చెప్పేలా మన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక
మార్పులకు శ్రీకారం చుట్టిందనీ కృష్ణ దాస్ వివరించారు. కార్యక్రమంలో
డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్
కే.శ్రీధర్, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, వాన గోపి, మాజీ జడ్పిటిసి సభ్యులు చింతు
రామారావు, ముద్దాడ బైరాగి నాయుడు, స్థానిక సర్పంచ్ బురెల్లి శంకర్, రాజాపు
అప్పన్న, కోరాడ చంద్రభూషణ్ గుప్తా, బొబ్బది ఈశ్వరరావు, తంగి మురళీకృష్ణ,
పాగోటి రాజారావు, నరసన్నపేట ఏడి రవీంద్ర భారతి, నాలుగు మండలాల వ్యవసాయ శాఖ
అధికారులు పాల్గొన్నారు.