కోనసీమ : రైతాంగంలో నూతన ఒరవడి పెంపుదలే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి
వైయస్ జగన్మోహన్ రెడ్డి తనదైన తరహాలో ముందుకు వెళుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ
మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. సోమవారం ఉప్పలగుప్తం మండలం
భీమనపల్లి గ్రామంలో మంత్రి పినిపే విశ్వరూప్,జిల్లా కలెక్టర్ హిమాన్షు
శుక్లాతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నూతన వరవడి తెచ్చే
విధంగా రైతులకు ఇతోతికంగా లబ్ది చేకూర్చడంలో ముఖ్యమంత్రి ఎనలేని కృషి
చేస్తున్నారన్నారు. రైతాంగానికి ఆర్బికే ల ద్వారా నాణ్యమైన విత్తనాలు,
ఎరువులు, పురుగు మందులు అందించడంతోపాటు వైయస్సార్ యంత్ర పరికరాలు అందించడం
ద్వారా రైతుల్లో విశ్వాసం పెంపొందే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జూన్ ఒకటో తేదీన సాగునీరు విడుదల చేయడం
జరిగిందన్నారు. భూమిని నమ్ముకున్న రైతు తమ కష్టసుఖాల్లో తాము పాలుపంచుకునే
విధంగా తాను, జిల్లా కలెక్టర్ నేరుగా వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో
పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ తాను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
కోనసీమ జిల్లాలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వరి నాట్ల సమయంలో రైతులతో
కలిసి పొలాల్లో వరి విత్తనాలు చల్లడం (నారుమడులు వేయడం) ఆనందంగా ఉందన్నారు.
రైతుకు కష్టం కలగకూడదని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న
కార్యక్రమాలను పూర్తిస్థాయిలో రైతాంగానికి చేరువ అయ్యే విధంగా జిల్లా
యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి పినిపే విశ్వరూప్, కలెక్టర్
హిమాన్షు శుక్లాలు భీమనిపల్లిలోని
యేళ్ల దుర్గారావు పొలంలో
సంపద (ఎంపీ 9558) రకం వరి విత్తనాలను పంట పొలాల్లో వెదజల్లారు. ఈ వరి
విత్తనాలు జల్లే కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఓలేటి బోసు బాబు,
స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.