హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఈ
నెల 14 వరకు సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.
శ్రీరామనగరంలోని ఈ స్ఫూర్తి కేంద్రంలో నేటి ఉదయం 10.30 గంటలకు త్రిదండి
చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ
స్నపనంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విష్వక్సేన వీధి శోధన నిర్వహిస్తారు.
1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం 5 నుంచి 45 నిమిషాలపాటు సామూహిక
విష్ణు సహస్రనామ స్త్రోత్ర పారాయణం, సాయంత్రం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు
అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటాయని నిర్వాహకులు
తెలిపారు. వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో వారి కోసం
ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.