హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద రూ.29.50కోట్ల
రూపాయలతో నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
ప్రారంభించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామన్న
ఆయన మూసీ నదిపైనా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు.
‘‘మురుగు నీటిని పునర్వినియోగించేలా పాలసీని తీసుకొస్తాం. సెప్టెంబర్ నాటికి
హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుంది. రద్దీ మేరకు సర్వీస్
రోడ్లను విస్తరించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజల విజ్ఞప్తి మేరకు
ఓఆర్ఆర్పై 120కి.మీ. వరకు వాహనాల స్పీడు పెంచాం. మూసీ నదిపై 14 బ్రిడ్జ్‌ల
నిర్మాణానికి అనుమతులిచ్చాం. శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే
నిర్మిస్తాం. త్వరలో కోకాపేట్, మల్లంపేట్‌లో ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయి. మూసీపై
స్కైవే కూడా నిర్మిస్తాం. శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50కోట్లు
కేటాయించాం. బీహెచ్ఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరిస్తాం.
హైదరాబాద్‌లో 100శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మెహిదీపట్నంలో
స్కైవాక్ కోసం రక్షణ మంత్రిని స్థలం అడిగాం. హైదరాబాద్ అభివృద్ధికి
సహకరించాలని కేంద్రాన్ని అడిగినా స్పందనలేదు. శామీర్‌పేట్ – జేబీఎస్
స్కైవాక్ కోసం రక్షణ భూములు ఇవ్వాలని అడిగాం. భూములు కేటాయించి ప్రజలకు
ప్రధాని తీపి కబురు చెప్పాలి. ఆగస్టులో హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్
ప్రారంభిస్తాం’’ అని కేటీఆర్ చెప్పారు. కాగా నార్సింగి వద్ద ఏర్పాటు చేసిన
ఇంటర్ ఛేంజ్‌తో మంచిరేవుల, గండిపేట ప్రాంతాల ప్రయాణికులతో పాటు లంగర్‌హౌస్,
శంకర్పల్లి నుంచి వచ్చే వారు ఓఆర్ఆర్ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోడానికి
ఎంతో సులువు కానుంది.