విజయవాడ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించేందుకు ప్రభుత్వం
చర్యలు తీసుకుంటోందని ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం చుట్టుగుంట కాల్వగట్టు వద్ద ఇంటింటికీ
తిరిగి ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా
ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని
ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే
అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర
లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్లు వెళ్లి పింఛన్ డబ్బును
అందజేస్తున్నట్లు తెలియజేశారు. అదే చంద్రబాబు గత పాలనలో పింఛన్ల కోసం
లబ్ధిదారులు రోజుల తరబడి కార్యాలయాల బయట పడిగాపులు కాసే దయనీయ పరిస్థితులు
ఉండేవన్నారు. పైగా 5 డివిజన్లకు కలిపి ఒకచోట ఎండలో కూర్చోబెట్టి పింఛన్
దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారని గుర్తుచేశారు. అటువంటి అమానవీయమైన
విధానానికి సీఎం వైఎస్ జగన్ స్వస్తి పలికారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా
ఇంటివద్దకే పెన్షన్ అందిస్తుండటంతో పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయని
పేర్కొన్నారు.
తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు
అందేవని.. కానీ ఈ ప్రభుత్వంలో 62.53 లక్షల మందికి నెలకు రూ. 1,590.50 కోట్లు
అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది
దాదాపు 4 రెట్లు అధికమన్నారు. అలాగే సెంట్రర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 16
వేలు మాత్రమే ఉన్న పింఛన్లను 25,252 కి పెంచి ప్రతినెలా రూ.6.51 కోట్లు
అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 11,661 మంది అవ్వాతాతలకు రూ.2.91 కోట్లు.,
8,769 మంది వితంతువులకు రూ.2.19 కోట్లు., 2,911 మంది దివ్యాంగులకు రూ. 87.33
లక్షలు., 1,488 మంది ఒంటరి మహిళలకు రూ. 37.20 లక్షలు ప్రతినెలా
అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క 26వ డివిజన్లోనే 688 మందికి రూ. 17.71 లక్షలు
ప్రతినెలా క్రమం తప్పకుండా పింఛన్ రూపంలో పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అర్హులందరికీ తాము పింఛన్ అందజేస్తున్నామని చెప్పడానికి ఈ గణాంకాలే
నిదర్శనమని వ్యాఖ్యానించారు. వచ్చే జనవరి నుంచి పింఛన్ సాయాన్ని రూ. 2,750
కి పెంచనున్నట్లు వివరించారు. మరోవైపు అధికారంలో ఉన్న గత ఐదేళ్లు మధురానగర్
రైల్వే అండర్ బ్రిడ్జిని పూర్తి నిర్లక్ష్యం చేసిన టీడీపీ నేతలు.. నేడు
ఆడుతున్న డ్రామాలను చూసి ఇదేం ఖర్మరా బాబూ అంటూ జనం అభిప్రాయపడుతున్నారని
మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆర్.యు.బి.ని పూర్తిచేసి
తీరుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి
అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, డివిజన్ కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు,
నాయకులు బి.శంకర్, రమణ, అన్సారీ బేగ్, దాసు, రాఘవ, బాడిత అప్పారావు, సచివాలయ
సిబ్బంది, పింఛన్ దారులు పాల్గొన్నారు.