భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమారామం శివనామస్మరణతో మార్మోగుతుంది. మహా శివరాత్రి, శనివారం, శనిత్రయోదశి కావడంతో భక్తులు పోటెత్తారు. సోమేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. తెలుపు రంగులో నుండి గోధుమ రంగులోనికి మారుతూ సోమేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పంచారామాల్లో విశిష్టమైన ఆరామం సోమారామం. ఇక్కడి స్వామి వారి లింగం అమావాస్యకు గోధుమ వర్ణంలోనూ పౌర్ణమికి తెలుపు రంగులోనికి మారుతూ ఉంటుంది. స్వామివారి తల పైభాగాన అన్నపూర్ణమ్మ ఉండడం మరో విశేషం. స్వామివారిని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించడం వల్ల చంద్రకళలు స్వామి లో కనిపిస్తాయని అర్చకులు చెబుతున్నారు. సోమారామంలోని సోమేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకాలు చేస్తే కోరుకున్న కోరికలు తీరి మనశ్శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈరోజు సాయంత్రం కళ్యాణం నిర్వహిస్తారు. రేపు రథోత్సవం మరుసటి రోజు హంస వాహనంపై తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.